IND vs ENG 2025: గిల్ అనవసర దూకుడే ఇంగ్లాండ్ విజయానికి కారణమైంది: టీమిండియా మాజీ బ్యాటర్

IND vs ENG 2025: గిల్ అనవసర దూకుడే ఇంగ్లాండ్ విజయానికి కారణమైంది: టీమిండియా మాజీ బ్యాటర్

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమి ఊహించనిది. మ్యాచ్ మొత్తం మనోళ్లే ఆధిపత్యం చూపించినా ఇంగ్లాండ్ ఒక్క సెషన్ లో తమ బౌలింగ్ తో ఫలితాన్ని మార్చేసి మన జట్టుకు తీవ్ర నిరాశను మిగిల్చింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను 192 పరుగులకే ఆలౌట్ చేసిన తర్వాత టీమిండియా విజయంపై ఎవరికీ అనుమానాలు లేవు. ప్రతి ఒక్కరు టీమిండియా విజయం ఖాయమనుకొని సంబరాల్లో మునిగిపోయారు. కట్ చేస్తే 193 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయలేక 170 పరుగులకే మన జట్టు ఆలౌట్ అయింది. మరోవైపు చివరి రోజు అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.

లార్డ్స్ టెస్టులో టీమిండియా ఓటమికి కారణం గిల్ అనవసర దూకుడు అని మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. కైఫ్ తన సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు. "జాక్ క్రాలేతో షుబ్‌మాన్ గిల్ ఫైటింగ్ ఇంగ్లాండ్ లో పోరాట స్ఫూర్తిని రగిలించింది. గిల్ ఆ సమయంలో క్రాలీతో మరీ అంత దూకుడుగా ప్రవర్తించాల్సింది కాదు. తన ఆటిట్యూడ్ కు గిల్ కట్టుబడాల్సి ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి గిల్ నేర్చుకుంటాడని ఆశిస్తున్నా. ఎడ్జ్‌బాస్టన్ లో తర్వాత స్టోక్స్ బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీ గురించి ప్రశ్నలు తలెత్తాయి. క్రాలీతో గొడవ స్టోక్స్ ను రెచ్చగొట్టింది". అని కైఫ్ ఎక్స్ లో రాశాడు.  

అసలేం జరిగిందంటే..?
 
మూడో టెస్ట్ లో మూడో రోజు ఆట చివర్లో హై డ్రామా చోటు చేసుకుంది. శనివారం (జూలై 12) ఆట ముగియడానికి 10 నిమిషాలు మిగిలి ఉన్న దశలో జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్ వేయడానికి వచ్చాడు. ఈ ఓవర్ మూడో బంతిని ఎదుర్కొనే ముందు జాక్ క్రాలీ పదే పదే బుమ్రా బౌలింగ్ ఆడకుండా పక్కకి వెళ్ళిపోయాడు. దీంతో టీమిండియా ప్లేయర్స్ అసహనానికి గురయ్యారు. కెప్టెన్ శుభమాన్ గిల్ ఇంగ్లాండ్ కావాలనే సమయం వృధా చేస్తుందని భావించాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలీ దగ్గరకు వెళ్లి వేలు చూపిస్తూ మాట్లాడాడు. అంతేకాదు మాటలతో క్రాలీపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

Also Read:-ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. టాప్‌లోనే బుమ్రా, జడేజా.. జైశ్వాల్, గిల్ వెనక్కి

ఓవరాల్ గా ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆలౌటైంది.   రూట్ (104) సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు, బుమ్రా 5 వికెట్లతో రాణించాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో ఇండియా కూడా సరిగ్గా 387 పరుగులు చేసింది. రాహుల్ సెంచరీ చేసి ఇండియాను ఆదుకున్నాడు. భారత బౌలర్లు విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 192 పరుగులకే ఆలౌట్ అయింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయింది.