
క్రికెట్ లో తండ్రి కొడుకులు కలిసి ఆడడం ఒక కల. వారిద్దరే ప్రత్యర్థులుగా ఆడితే అంతకంటే షాకింగ్ మూమెంట్ ఇంకొకటి ఉండదు. ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నబీ 2009 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. 16 ఏళ్ళు సుదీర్ఘ కెరీర్ లో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పినా.. 18 ఏళ్ల తన కొడుకు హసన్ ఐసాఖిల్‌తో అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ఉందనే తన కోరికను బయట పెట్టి ఆశ్చర్యానికి గురి చేశాడు.
నబీ అనుకున్న మూమెంట్ వచ్చేసింది. ష్పగీజా క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా తన కొడుకుతో ప్రత్యర్థిగా బరిలోకి దిగాడు. మంగళవారం (జూలై 22) కాబూల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అమో షార్క్స్ తరఫున బరిలోకి దిగిన 18 ఏళ్ళ ఓపెనర్ ఐసాఖిల్.. తన తండ్రి నబీ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే సిక్సర్ కొట్టి ఆశ్చర్యానికి గురి చేశాడు. 9 ఓవర్ ఇన్నింగ్స్ తొలి బంతికి స్లాగ్ స్వీప్ ఆడుతూ లాంగన్ లో భారీ సిక్సర్ బాదాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతో అనుభవం ఉన్న నబీ బౌలింగ్ లో తన కొడుకు తొలి బంతికే సిక్సర్ కొట్టడం ఆకట్టుకుంటుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
SON HITTING FATHER FOR A SIX.
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 22, 2025
- Hassan Eisakhil welcomed his father Mohammad Nabi with a six. 😄pic.twitter.com/2T1gzzXkzq
సిక్సర్ కొట్టిన వెంటనే నబీ తన కొడుకు వైపు చూస్తూ చిరు నవ్వు నవ్వడం విశేషం. ఓవరాల్ గా ఐసాఖిల్ ఈ మ్యాచ్ లో 36 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో సహా 52 పరుగులు చేసి ఔటయ్యాడు. ఐసాఖిల్ ఇన్నింగ్స్ తో అమో షార్క్స్ మొదట బ్యాటింగ్ చేసి 19.4 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. ఐసాఖిల్ ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయకపోయినా.. డొమెస్టిక్ క్రికెట్ లో 25 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున నాలుగు మ్యాచ్‌ల్లో 43 పరుగులు చేశాడు. ఐసాఖిల్ త్వరలోనే తన తండ్రి నబీతో కలిసి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతాడని నెటిజన్స్ భావిస్తున్నారు.