హమాస్ దాడుల వెనక సూత్రధారి డెయిఫ్​

హమాస్ దాడుల వెనక సూత్రధారి డెయిఫ్​

గాజా స్ట్రిప్: జెరూసలెంలోని ఆల్​అక్సా మసీదుపై 2021 మే నెలలో ఇజ్రాయెల్​ దాడి చేసింది. రంజాన్ ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లిన వారిపట్ల బలగాలు కర్కశంగా వ్యవహరించాయి. విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు భక్తులను మసీదులో నుంచి బయటకు లాక్కొచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను టీవీలో చూసిన ముస్లిం లోకం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ప్రతీకారంగా హమాస్ మిలిటెంట్ కమాండర్ మొహమ్మద్​ డెయిఫ్ ప్రతీకార దాడికి పథకం రచించాడు. ఆల్ అక్సా మసీదుపై జరిగిన దాడే తాజా దాడులకు ప్రేరణ.. దాడి వెనకున్న మాస్టర్ మైండ్ మొహమ్మద్​ డెయిఫ్..

చిక్కడు దొరకడు..
గతంలో ఎన్నో దాడులకు పాల్పడ్డ డెయిఫ్ ను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ ఇంటలిజెన్స్ వర్గాలు చాలాసార్లు ప్రయత్నించాయి. ఆచూకీ కనిపెట్టి వెళ్లేలోగా డెయిఫ్ అక్కడి నుంచి మాయమయ్యేవాడని అధికారులు తెలిపారు. పలుమార్లు దాడి జరిగినా తృటిలో తప్పించుకున్నాడని వివరించారు. డెయిఫ్ టార్గెట్​ గా జరిగిన ఓ దాడిలో అతడి భార్యాపిల్లలు చనిపోయారని తెలిపారు. ఆధునిక టెక్నాలజీకి డెయిఫ్ దూరంగా ఉంటాడని, దీంతో అతడి ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారుతోందని చెప్పారు. ఇప్పటి వరకు డెయిఫ్​ ఫొటోలు మూడంటే మూడు మాత్రమే దొరికాయని.. ఒకటి ఇరవై ఏళ్లప్పటి ఫొటో కాగా రెండోది మాస్క్ తొడిగిన ఫొటో, మూడో ఫొటో లో డెయిఫ్​ నీడ మాత్రమే కనిపిస్తుందని చెప్పారు. కాగా, తాజా దాడుల వెనక డెయిఫ్​ ఉన్నాడని తేలడంతో మరోమారు అతడి కోసం ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు వేట మొదలుపెట్టాయి.