Asia Cup 2025: తుది జట్టు నుంచి తిలక్ వర్మను తప్పించండి.. శాంసన్‌కు సపోర్ట్‌గా భారత మాజీ క్రికెటర్

Asia Cup 2025: తుది జట్టు నుంచి తిలక్ వర్మను తప్పించండి.. శాంసన్‌కు సపోర్ట్‌గా భారత మాజీ క్రికెటర్

ఆసియా కప్ ప్రారంభానికి వారం రోజుల సమయం ఉంది. ఎనిమిది జట్ల మధ్య జరగబోయే ఈ కాంటినెంటల్ టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి జరగనుంది. యూఏఈ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మరోవైపు పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి జట్లు టైటిల్ కోసం గట్టిగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ టోర్నీలో ఆడబోయే భారత తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైస్ కెప్టెన్ గా శుభమాన్ గిల్ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు ఎవరిపై వేటు పడుతుందో చెప్పలేని పరిస్థితి. 

ఏడాది కాలంగా భారత టీ20 జట్టులో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వరం టాప్ -3 గా మ్యాచ్ లు ఆడుతూ వచ్చారు. అభిషేక్ తుది జట్టులో ఉండడం ఖాయంగా కనిపిస్తున్నా శాంసన్ లేకపోతే తిలక్ వర్మలలో ఒకరిపై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. శుభమాన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఆసియా కప్ కు సెలక్ట్ కావడమే ఇందుకు కారణం. అదే జరిగితే శాంసన్ బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తుంది. సూర్య, హార్దిక్, రింకూ సింగ్, అక్షర్ పటేల్ వరుసగా నాలుగు, ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. దీంతో మూడో స్థానం ఒక్కటే ఖాళీగా ఉంది.

మూడో స్థానంలో అద్భుతమైన ఫామ్ లో ఉన్న తిలక్ వర్మ తుది జట్టులో ఉంటాడని చాలంది క్రికెట్ ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. అయితే అనుభవం దృష్టిలో పెట్టుకొని సంజు శాంసన్ ను మూడో స్థానంలో ఆడించాలని టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. కైఫ్ మాట్లాడుతూ.. "అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆసియా కప్‌లో ఓపెనింగ్ చేస్తారు. మూడో స్థానంలో తిలక్ వర్మ  వేచి ఉండక తప్పదు. సంజు అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్. అతన్ని మూడో స్థానంలో అవకాశాలు ఇచ్చి తీర్చిదిద్దవచ్చు. ఆరు నెలల తర్వాత ప్రపంచ కప్ ఉంది. అతను వరల్డ్ కప్ లో చోటు సంపాదించేందుకు అర్హుడు". అని కైఫ్ అన్నాడు. 

శాంసన్ అంతర్జాతీయ టీ20ల్లో కేవలం మూడు మ్యాచ్ ల్లోనే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే మూడో స్థానంలో చాలానే అనుభవం ఉంది. ఈ కేరళ కీపర్-బ్యాటర్ 291 ఇన్నింగ్స్‌లలో 133 ఇన్నింగ్స్‌ల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి 4136 పరుగులు చేశాడు. వీటిలో మూడు సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు తిలక్ వర్మ సైతం మూడో స్థానంలో అద్భుతమైన రికార్డ్ ఉంది. గత ఏడాది టీ20 ఫార్మాట్ లో మూడు సెంచరీలు చేసిన ఈ హైదరాబాదీ క్రికెటర్ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.