తిలక్ వర్మకు షాక్.. సిరాజ్ చేతికి హైదరాబాద్ కెప్టెన్సీ పగ్గాలు 

తిలక్ వర్మకు షాక్.. సిరాజ్ చేతికి హైదరాబాద్ కెప్టెన్సీ పగ్గాలు 

రాబోయే రంజీ ట్రోఫీ 2026–27 సీజన్‌కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. గత సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన యువ బ్యాటర్ తిలక్ వర్మను కాదని, సిరాజ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడం క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. మరో పేసర్ తెలంగాణ డీజీపీ కొడుకు చామ మిలింద్‌కు వైస్ కెప్టెన్సీ దక్కింది.

తిలక్ వర్మను ఎందుకు తప్పించారు: 

భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న తిలక్ వర్మ అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీగా ఉండనున్నాడు. రంజీ ట్రోఫీలో చాలా మ్యాచ్‌లకు తిలక్ అందుబాటులో ఉండే ఛాన్స్ లేకపోవడంతోనే హెచ్‌సీఏ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 11వ తేదీన త్రిపురతో జరగబోయే తొలి పోరుతో హైదరాబాద్ తన రంజీ ప్రయాణాన్ని స్టార్ట్ చేయనుంది. నవంబర్ 18 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు సిరాజ్ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌ను నడిపించనున్నాడు.

వేగం తగ్గడంపై సిరాజ్ రచ్చ కామెంట్స్: 

శ్రీలంక టెస్ట్ సిరీస్‌తో పాటు ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో సిరాజ్ బౌలింగ్ వేగం తగ్గడంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దీనిపై సిరాజ్ మాట్లాడుతూ.. రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత నేరుగా మైదానంలోకి దిగడం వల్ల రిథమ్ కాస్త దెబ్బతింది. నేను ప్యూర్ రిథమ్ బౌలర్‌ను.. నా రన్-అప్‌లో కొన్ని అడుగులు పొట్టిగా, కొన్ని పొడవుగా పడటం వల్ల ఫ్లో మిస్సై స్పీడ్ తగ్గిందే తప్ప మరొకటి కాదని క్లారిటీ ఇచ్చాడు.

బీసీసీఐ నిఘా.. న్యూజిలాండ్ సిరీస్ టార్గెట్: 

న్యూజిలాండ్‌తో జరగనున్న కీలక టెస్టు సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రాతో కలిసి సిరాజ్ భారత పేస్ విభాగాన్ని ముందుండి నడిపించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 32 ఏళ్ల సిరాజ్ వర్క్‌లోడ్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించనుంది. రంజీ మ్యాచ్‌ల్లో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడం ద్వారా సిరాజ్ తిరిగి తన పాత రిథమ్, స్పీడ్‌ను అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. రంజీ కెప్టెన్‌గా సిరాజ్ హైదరాబాద్‌ను ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూద్దాం..