ICC player of the month: ఓవల్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ను వణికించిన సిరాజ్‌కు ఐసీసీ అవార్డు

ICC player of the month: ఓవల్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ను వణికించిన సిరాజ్‌కు ఐసీసీ అవార్డు

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ను ఐసీసీ అవార్డు వరించింది. ఈ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటి 2025 ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఆగస్టు లో ఇంగ్లాండ్ తో ముగిసిన చివరి టెస్టులో సిరాజ్ చేసిన ప్రదర్శనకు గాను ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కోసం నామినీలుగా ఎంపికైన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్.. న్యూజిలాండ్ పేసర్ మాట్ హెన్రీలను ఓడించి సిరాజ్ సోమవారం (సెప్టెంబర్ 15) ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఆగస్టు నెలలో సిరాజ్ ఒక్క టెస్ట్ మాత్రమే ఆడడం విశేషం.

అవార్డు గెలుచుకున్న తర్వాత సిరాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.. "ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికవడం ఒక ప్రత్యేక గౌరవం. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఒక చిరస్మరణీయ సిరీస్. నేను పాల్గొన్న అత్యంత తీవ్రమైన పోటీలలో ఇది ఒకటి. ముఖ్యంగా మ్యాచ్ ను నిర్ణయించే పరిస్థితుల్లో నా స్పెల్ జట్టుకు ఉపయోగపడినందుకు గర్వపడుతున్నాను. ఇంగ్లాండ్ గడ్డపై బౌలింగ్ చేయడం సవాలుతో కూడుకున్నది. ఈ సిరీస్ నాలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసుకొని వచ్చింది. ఈ అవార్డు నాలాగే నా సహచరులకు, నా సహాయక సిబ్బందికి కూడా చెందుతుంది". అని ఈ హైదరాబాదీ పేసర్ అన్నాడు. 

ఓవల్ టెస్టులో సిరాజ్ మ్యాజిక్
    
ఓవల్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఐదో టెస్ట్ సెకండ్ ఇన్సింగ్స్‎లో ఐదు వికెట్లతో చెలరేగి భారత్‎కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ కు భారీ ఆధిక్యం దక్కకుండా చేశాడు. ఓవరాల్ గా ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 9 వికెట్లు తీసుకున్న సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరాజ్ అద్భుత స్పెల్ తో ఇంగ్లాండ్ తో సిరీస్ ను ఇండియా 2-2 తేడాతో సిరీస్ ను సమం చేసింది. ఈ సిరీస్ లో సిరాజ్ మొత్తం 23 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గానిలిచాడు. 

ఓర్లా ప్రెండర్‌గాస్ట్ కు మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు:

మహిళల విభాగంలో ఐర్లాండ్ ఆల్ రౌండర్ ఓర్లా ప్రెండర్‌గాస్ట్ 2025 ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది. పాకిస్తాన్ వికెట్ కీపర్-బ్యాటర్ మునీబా అలీ, నెదర్లాండ్స్‌ ప్లేయర్ ఐరిస్ జ్విల్లింగ్‌లను ఓడించి ఈ అవార్డును గెలుచుకుంది. "ఈ అవార్డు అందుకున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఐసీసీకి.. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా సహాయక సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నాను". అని ప్రెండర్‌గాస్ట్ అవార్డు గెలుచుకున్న తర్వాత చెప్పుకొచ్చింది.