చంద్రబాబు మమ్మల్ని అవమానించారు : మోహన్ బాబు

చంద్రబాబు మమ్మల్ని అవమానించారు : మోహన్ బాబు

తిరుపతి: ఫీజు రీ ఇంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలనీ… లేదంటే ఆందోళనకు దిగుతామని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు. కోట్లాది మంది  విద్యార్థులకు గతంలో ఫీజు రీఇంబర్స్ మెంట్ పథకంతో ఎంతో మేలు జరిగిందనీ.. చంద్రబాబు అంటే నాకు గౌరవం ఉందనీ.. ఐతే.. బకాయిలు పెండింగ్ లో పెట్టడం బాగాలేదని అన్నారు. తమ విద్యాసంస్థలకు చంద్రబాబు అనేకసార్లు వచ్చారనీ.. 2014 నుండి 18 వరకు రూ.16 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. చంద్రబాబు పాలసీలు ప్రవేశపెడతారు కానీ.. విద్యార్తులకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వరని విమర్శించారు.

“నేను ఏ పార్టీ కి సంబంధించిన వ్యక్తిని కాదు. సీయంకి అనేక మార్లు లేఖలు రాశాను. అయినా ఏమాత్రం స్పందించటం లేదు. 17-18 కొత్త రూల్ పెట్టారు, 3 మాసాలకు ఓసారి చెల్లిస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదు. భిక్షం వేసినట్లు కొద్దిగా చెల్లిస్తున్నారు. ఇలాగైతే పిల్లలు ఎలా చదవాలి, టీచర్లకు జీతాలు ఎలా చెల్లించాలి. చంద్రబాబు నీవు ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఎంతకాలం ఇలా..? నాకు ఏ కులం లేదు, నేను అందరివాడ్ని. ఆస్తులు తాకట్టు పెట్టి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. నాణ్యత లేని విద్యను నేను ఇవ్వలేను కదా. నేను రాజకీయం కోసం మాట్లాడలేదు, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేకుంటే మరింత ఆందోళనకి సిద్దం. ఈ ప్రభుత్వంలో మాకు, విద్యార్థులకు, విద్యాసంస్థలకు అవమానం జరిగింది” అని మోహన్ బాబు అన్నారు.