Prabhas B'day: 'అరడజను' పిల్లలతో సంతోషంగా ఉండు బావా! డార్లింగ్‌కు మోహన్‌బాబు బర్త్‌డే విష్!

Prabhas B'day: 'అరడజను' పిల్లలతో సంతోషంగా ఉండు బావా! డార్లింగ్‌కు మోహన్‌బాబు బర్త్‌డే విష్!

పాన్ -ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) ఈ రోజు (అక్టోబర్ 23) తన 46వ  పుట్టినరోజును జరుపుకున్నారు. డార్లింగ్‌ బర్త్‌డే సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, మంచు మోహన్‌బాబు (Mohan Babu) చేసిన స్పెషల్ బర్త్‌డే ట్వీట్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్‌ను ముద్దుగా "బావ" అని పిలిచే మోహన్‌బాబు... కేవలం విష్ చేయడమే కాక, ఆయన పెళ్లి, పిల్లలపై కూడా ఆసక్తికరమైన కోరికను వ్యక్తం చేశారు.


 త్వరలో వివాహం చేసుకుని అర డజను మంది పిల్లలతో..

"నా ప్రియమైన డార్లింగ్ బావా ప్రభాస్, మొత్తం దేశం గర్వించదగ్గ వ్యక్తివి నువ్వు. నీవు అంతులేని ఆనందంతో దీవించబడాలి,. మరిన్ని పుట్టినరోజులను ఘనంగా జరుపుకోవాలి. నీవు వంద సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో,  ఆనందంతో జీవించాలి. అన్నిటికంటే ముఖ్యంగా, నువ్వు త్వరలో వివాహం చేసుకుని అర డజను మంది పిల్లలతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను! హృదయపూర్వకమైన ప్రేమతో, ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమించే మీ బావా." అంటూ మోహన్‌బాబు ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

ప్రభాస్, మోహన్‌బాబుల మధ్య చాలా బలమైన అనుబంధం ఉంది. 'కన్నప్ప' కంటే ముందే వీరిద్దరూ 'బుజ్జిగాడు' (2008) సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా నుంచే ఒకరినొకరు 'బావ' అని ప్రేమగా పిలుచుకోవడం అలవాటైంది.  'కన్నప్ప'లో ప్రభాస్ నటించడానికి ప్రధాన కారణం కూడా మోహన్‌బాబుపై ఉన్న గౌరవమే.

ఫ్యాన్స్ రియాక్షన్..

మోహన్‌బాబు చేసిన ఈ ట్వీట్‌పై ప్రభాస్ అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు. "అసలు పెళ్లి ఊసే లేదంటే, అరడజను పిల్లల వరకు వెళ్లిపోయారా?" అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు... "అరడజను పిల్లలతో ప్రభాస్‌ను ఊహించుకుంటే భలే సరదాగా ఉంది" అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా, మోహన్‌బాబు కోరుకున్నట్లుగా డార్లింగ్ ప్రభాస్ త్వరగా పెళ్లి పీటలు ఎక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు..