ODI World Cup 2023: ఇండియాతో మ్యాచ్ అనగానే మావాళ్లు భయపడుతున్నారు: పాక్ మాజీ దిగ్గజం

ODI World Cup 2023: ఇండియాతో మ్యాచ్ అనగానే మావాళ్లు భయపడుతున్నారు: పాక్ మాజీ దిగ్గజం

వరల్డ్ కప్‌ అంటే చాలు.. ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచే. ఈ పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఈ చిరకాల ప్రత్యర్థుల సమరంలో వచ్చే ఆ మజానే వేరు! అహ్మదాబాద్ గడ్డపై అక్టోబర్ 14న ఈ ఇరు జట్లు తలపడునున్నాయి. ఈ క్రమంలో ఆ జట్టు మాజీ దిగ్గజం మొయిన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియాతో మ్యాచ్ అనగానే పాక్  ఆటగాళ్లలో ఎక్కడలేని భయం పుట్టుకొస్తుందని తెలిపాడు. ఆసియా కప్ లో కూడా అదే జరిగిందని వెల్లడించాడు.

దాయాది పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు ఎప్పుడు..? ఎలా ఆడతారో ఎవరూ ఊహించలేం. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడటం.. ఓడే మ్యాచ్‌లో గెలవటం వారికి సదా మామూలే. రెండ్రోజుల క్రితం న్యూజిలాండ్‌తో ఉప్పల్ వేదికగా  జరిగిన తొలి వామప్‌ మ్యాచ్ కూడా అటువంటిదే. 342 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ.. మ్యాచ్ కాపాడుకోలేకపోయారు. కివీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బౌండరీల వర్షం కురిపిస్తూ పాకిస్తాన్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఈ క్రమంలో మొయిన్ ఖాన్ మాటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

"నేను చెప్తున్నది 100 శాతం నిజం. మైదానంలో మా ఆటగాళ్లు ఎవరికీ వారే అన్నట్లు నడుచుకుంటున్నారు. బాబర్ ఆజాంకు సలహా ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. అనుభవం ఉన్న రిజ్వాన్, షాదాబ్, షహీన్ లాంటి ప్లేయర్స్ కూడా సందేహిస్తున్నారు. ఆటగాళ్ల మధ్య ఎలాంటి చర్చలు జరగడం లేదు. ఇవన్నీ చూస్తుంటే.. జట్టులో ఐకమత్యం లేదని స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ఎవరైనా బాబర్‌కు సలహాలు ఇచ్చినా.. వాటిని అతను ఫాలో అవుతున్నా అవి పనిచేయడం లేదు.. "

"ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. భారత్‌తో మ్యాచ్ అనగానే మావాళ్లలో ఎక్కడ లేని భయం పుడుతోంది. ఎవరైతే అలా భయపడతారో వారిచ్చే సలహాలు పని చేయవు. అది జట్టుకు సరైనది కూడా కాదు.. మీరిచ్చే సలహాలు వర్కౌట్ కాకపోవచ్చు. అది సహజమే. ఒక క్రికెటర్‌గా జట్టు కోసం వందశాతం కష్టపడాలి. ఇలా భయపడకూడదు..' అని మొయీన్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

1992 ఛాంపియన్స్

కాగా, ప్రపంచ కప్ పోరులో పాక్‌ జట్టు ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. 1974 మొదటి ప్రపంచకప్ మినహాయిస్తే.. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు సెమీస్‌ వరకూ వెళ్లారు. 1992లో ఛాంపియన్‌గా అవతరించగా, 1999లో రన్నరప్‌గా నిలిచారు. కానీ ఆ తర్వాత జట్టు ప్రదర్శన అంతకంతకూ పడిపోతూ వచ్చింది. 2011 టోర్నీలో సెమీస్‌ చేరడమే గత అయిదు ప్రపంచకప్‌ల్లో పాక్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. కానీ ఇప్పుడు మాత్రం పాక్‌ జట్టు బలంగా కనిపిస్తోంది. కొంతకాలంగా మెరుగైన క్రికెట్ ఆడుతోంది. మరి ఏమాత్రం రాణిస్తారనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.