మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన..ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎక్కడ..?

మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన..ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎక్కడ..?

మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలు తమను కొందరు వ్యక్తులు ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. రూ. 100 కోట్ల ఆఫర్ ఇచ్చారని రోహిత్ రెడ్డి చెప్పారు. అయితే ఘటన జరిగిన రోజు నుంచి ఆ నలుగురు ఎమ్మెల్యేలు కనిపించకుండా పోయారు.

మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన తర్వాత ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతిభవన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.  కేసీఆర్ తో ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఆయనకు చెప్పినట్లు సమాచారం. ఆ రోజు రాత్రి అక్కడే బస చేసిన నలుగురు ఎమ్మెల్యేలు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెడతారని వార్తలు వచ్చాయి. అయితే రోజులు గడుస్తున్నా అలాంటిదేం జరగలేదు. ఇంతకీ ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది. తాజాగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేశారు. ఇవాళ పెద్దసారు ప్రెస్ మీట్ ఉంటుందని అందులో రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తో పాటు ఆ నలుగురు ఎమ్మేల్యులు మీడియా ముందుకు వచ్చే అవకాశముంది 

కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తారనే ప్రచారం జరిగినా..ఇంత వరకు ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఈ అంశంపై టీఆర్ఎస్ నాయకులెవరు మాట్లాడొద్దని కేటీఆర్ ఆదేశించారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున్న ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దన్నారు. మరోవైపు పోలీసులకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ముగ్గురు నిందితుల రిమాండ్ ను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. సరైన ఆధారాలు లేవంటూ రిమాండ్ పిటిషన్ ను జడ్జి కొట్టేశారు. దీంతో పోలీసులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

మరోవైపు మొయినాబాద్ ఫాం హౌస్ ఘటనపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలను స్వామిజీలు ట్రాప్ చేస్తే... వారి కాల్ డేటా రికార్డులను, ఆడియోల ప్రూఫ్ లను పోలీసులుగానీ, ఎమ్మెల్యేలుగానీ ఎందుకు బయటపెట్టలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారంలో ఉంటే.. ఈ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం మొయినాబాద్ ఫాంహౌస్ లో ఎందుకు ఉన్నారు..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. 

ఇదిలా ఉంటే రూ.100 కోట్ల డీల్ తో ప్రలోభాలకు గురిచేశారన్న నలుగురు ఎమ్మెల్యేలు కూడా భారీ ప్రజాదరణ ఉన్న నేతలు కాదు. రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. ఇదంతా పక్కా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.