
ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆడియో లీక్స్ వైరల్ గా మారాయి. ఆడియో క్లిప్స్ ను ప్రగతిభవన్ వర్గాలు లీక్ చేశాయని తెలుస్తోంది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రామచంద్రభారతి మాట్లాడినట్లుగా ఉన్న ఫోన్ రికార్డు బయటికొచ్చింది. ఈ నెల 24కు ముందు ఈ ఆడియో సంభాషణ జరిగినట్లు చెబుతున్నారు. పార్టీ మారడంపై తనను నందు సంప్రదించాడని ఎమ్మెల్యే రోహిత్ అంటున్నట్లుగా ఆడియోలో ఉంది. తనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారని పైలట్ రోహిత్ రెడ్డి వారితో చెబుతున్నారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్ తనకు తెలుసన్నట్లుగా స్వామి మాట్లాడినట్లు ఆడియోలో ఉంది.
తనకు ఎదగడానికి అవకాశాలు ఇస్తామన్నారని పైలట్ రోహిత్ అన్నారు. అయితే ఈ టేపుల్లో ఎక్కడా డబ్బుల ప్రస్తావన, బెదిరింపులు లేకపోవడం కీలకంగా మారింది. అయితే డబ్బులిస్తామన్నారని.. బెదిరించారని రోహిత్ ఫిర్యాదు చేసినట్లు FIRలో ఉంది. ముందే ఫోన్లో మాట్లాడితే 26 వరకు రోహిత్ ఫిర్యాదు చేయలేదా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ నెల 24కు ముందే ఫోన్ రికార్డు చేసింది ఎవరన్న ప్రశ్న తెరపైకి వస్తోంది. రాష్ట్ర ఎమ్మెల్యేల ఫోన్లన్నీ పోలీసులతో ట్యాపింగ్ చేస్తున్నారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో పెరుగుతున్నాయి.
తమను కొందరు వ్యక్తులు ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలు ఆరోపించారు. రూ. 100 కోట్ల ఆఫర్ ఇచ్చారని రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఘటన జరిగిన రోజు నుంచి ఆ నలుగురు ఎమ్మెల్యేలు కనిపించకుండా పోయారు.
మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతిభవన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఆయనకు చెప్పినట్లు సమాచారం. ఆ రోజు రాత్రి అక్కడే బస చేసిన నలుగురు ఎమ్మెల్యేలు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెడతారని వార్తలు వచ్చాయి. అయితే రోజులు గడుస్తున్నా అలాంటిదేం జరగలేదు. ఇంతకీ ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది. తాజాగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేశారు. ఇవాళ పెద్దసారు ప్రెస్ మీట్ ఉంటుందని అందులో రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తో పాటు ఆ నలుగురు ఎమ్మేల్యులు మీడియా ముందుకు వచ్చే అవకాశముంది