నిర్మల్, వెలుగు: మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు కంతి లింగవ్వ అలియాస్ అనిత మరణంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన లింగవ్వ పేద కుటుంబంలో జన్మించింది. చిన్ననాడే తండ్రి మరణించడంతో తల్లి ఆమెను పోషించింది. అప్పట్లో పీపుల్స్ వార్ పార్టీ ఇక్కడి మారుమూల పల్లెలో సమాంతర వ్యవస్థ నడిపింది. ఈ క్రమంలోనే పీపుల్స్ వర్క్ అనుబంధంగా ప్రధాన రిక్రూట్ విభాగంగా పనిచేసే జననాట్యమండలి సభ్యుల పాటలకు లింగవ్వ ఆకర్షితురాలైంది. అప్పటి పీపుల్స్ వార్ పార్టీ సింగపూర్ దళంలో చేరింది. రెండేళ్లపాటు పార్టీలో కొనసాగిన ఆమె అప్పటికే దళంలో సభ్యుడుగా కొనసాగుతున్న మైలారం అడెల్లు అలియాస్ భాస్కర్ ను పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి భార్యాభర్తలు అజ్ఞాత ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. పీపుల్స్‌వార్ పార్టీ మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత అడెల్లు జిల్లా కమిటీకి నేతృత్వం వహించగా కంతి లింగవ్వ జిల్లా కమిటీ సభ్యురాలుగా కొనసాగారు.
పార్టీ కార్యకలాపాల్లో భాగంగా ఆమె 2002లో నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ లో తలదాచుకున్నారు. ఈమె షెల్టర్ తీసుకున్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు ఇంటిని చుట్టుముట్టి అరెస్టు చేశారు. మూడు సంవత్సరాలపాటు లింగవ్వ జైలు జీవితం గడిపారు. తర్వాత జైలు నుంచి విడుదలై ఆరు నెలలపాటు లక్ష్మీసాగర్ లోని ఇంటి వద్దే ఉన్నారు. అనంతరం మళ్లీ మావోయిస్టు పార్టీతో కాంటాక్ట్ ఏర్పడి దళంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ మెంబర్ గా, ఏరియా కమిటీ మెంబర్ గా కొనసాగుతున్నారు. ఆమె తలపై చత్తీస్ గఢ్ప్రభుత్వం రూ. 16 లక్షల రివార్డు ప్రకటించగా, తెలంగాణ ప్రభుత్వం రూ. 5 లక్షల రివార్డు ప్రకటించింది. అయితే లింగవ్వ పార్టీ కార్యకలాపాల విస్త రణలో భాగంగా రిక్రూట్మెంట్ లపై ఎక్కువ దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్సరిహద్దు ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణ కోసం సమావేశమయ్యారు. ఇదే సమయంలో పోలీసులు వీరిని చుట్టుముట్టి ఎదురుకాల్పులు జరపడంతో కంతి లింగవ్వ తోపాటు మరో వ్యక్తి మరణించారు. మరో వ్యక్తి ఎవరన్నది ఇంకా తేలలేదు.
