ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత.. ఆ దేశ పగ్గాలు చేపట్టిన ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ చుట్టూ ఒక పెద్ద మిస్టరీ కొనసాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో యుద్ధం ఐదో వారానికి చేరుకున్న వేళ ఇరాన్ నాయకత్వంపై సందిగ్ధత కొనసాగుతోంది. సుప్రీం లీడర్ పగ్గాలు చేపట్టిన తర్వాత బయటకు రాకపోవటం.. కేవలం సందేశాలు మాత్రమే పంపించటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఇరాక్ ప్రజలకు, అక్కడి మత పెద్దలకు మొజ్తాబా ఒక లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన అసలు ప్రాణాలతో క్షేమంగా ఉన్నారా లేదా అన్న అనుమానాలు రోజురోజుకూ తీవ్రం అవుతున్నాయి.
ఇరాక్‌కు మొజ్తాబా కృతజ్ఞతలు:
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ, ఇరాన్ మీడియా ఒక కీలక ప్రకటన చేసింది. ఇరాక్ అగ్రశ్రేణి షియా మతగురువు అలీ అల్-సిస్తానీతో పాటు అక్కడి ప్రజలకు మొజ్తాబా ఖమేనీ కృతజ్ఞతలు తెలుపుతూ ఒక సందేశాన్ని పంపారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులను వ్యతిరేకించడంలో ఇరాక్ చూపుతున్న చొరవను ప్రశంసించారు. ఇస్లామిక్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఇరాక్ ప్రతినిధులు, బాగ్దాద్‌లోని ఇరాన్ రాయబారి మధ్య జరిగిన సమావేశంలో ఈ సందేశం బయటకు వచ్చింది. ఈ క్లిష్ట సమయంలో ప్రాంతీయ సంఘీభావం చాలా అవసరమని ఆయన లేఖలో పేర్కొన్నారు.
మొజ్తాబాపై అనుమానాలు:
ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో తండ్రి అలీ ఖమేనీ మరణించిన తర్వాత మొజ్తాబా నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించలేదు. కేవలం కొన్ని లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదలవుతున్నాయి. అదే వైమానిక దాడిలో ఆయన కూడా గాయపడ్డారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఇరాన్ అధికారులు చెబుతున్నప్పటికీ, కనీసం ఒక్క వీడియో లేదా ఫోటో కూడా విడుదల కాకపోవడంతో ఆయన ఆరోగ్యంపై, ప్రాణహానిపై రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.
ఇరాన్ అస్థిరతపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఖమేనీ కుమారుడి గురించి మాకు ఏ సమాచారం లేదు.. ఆయన అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలియదంటూ ట్రంప్ బాంబు పేల్చారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం ఇరాన్‌కు చెందిన ఒక ఉన్నత స్థాయి అధికారితో చర్చలు జరుపుతోందని.. అయితే ఆ వ్యక్తి మాత్రం సుప్రీం లీడర్ మొజ్తాబా కాదని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవైపు యుద్ధం తీవ్రతరం అవుతుంటే.. మరోవైపు దేశాధినేత ఆచూకీ తెలియకపోవడం ఇరాన్ పౌరుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది.
యుద్ధ సమయంలో నాయకత్వం కనిపించకపోవడం అనేది ఆ దేశ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అంశం. మొజ్తాబా రాసిన తాజా లేఖ కేవలం దేశంలో పరిపాలన సాఫీగా సాగుతోందని ప్రపంచానికి నమ్మించడానికి చేసిన ప్రయత్నమా లేక నిజంగానే ఆయన క్షేమంగా ఉన్నారా అనేది మిస్టరీగానే కొనసాగుతోంది. ఒకవేళ నాయకత్వ మార్పు లేదా ఖాళీ ఏర్పడితే.. అది పశ్చిమాసియా రాజకీయ సమీకరణాలను మరింతగా మార్చే అవకాశం ఉంది. యుద్ధం తీవ్రతరం అవుతున్న తరుణంలో మొజ్తాబా ఖమేనీ ఎప్పుడు బయటకు వస్తారనేది ఇప్పుడు ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ప్రశ్నగా మారింది.
