పట్నంల పైసలు పంచితే.. జిల్లాల్లో పరువు పాయె

పట్నంల పైసలు పంచితే.. జిల్లాల్లో పరువు పాయె

రెండు రోజులుగా డబ్బులు, మద్యం పంచుతూ చిక్కిన పలువురు టీఆర్ఎస్ లీడర్లు

పట్టు బడ్డవారిలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు
పలుచోట్ల చితకబాదిన ప్రతిపక్ష నేతలు, పబ్లిక్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు
సొంత జిల్లాల్లో నవ్వులపాలు

హైదరాబాద్​, వరంగల్‍ రూరల్‍, వెలుగు: గ్రేటర్‍ హైదరాబాద్‍ ఎన్నికల ప్రచారం కోసం జిల్లాల  నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పెద్ద లీడర్ల వెంట వెళ్లిన టీఆర్​ఎస్ సెకండ్​ క్యాడర్​ లీడర్లలో చాలామంది అక్కడ క్యాండిడేట్ల తరుపున ఓటర్లకు  పైసలు, లిక్కర్​ పంచుతూ ప్రతిపక్షనేతలు, పబ్లిక్​కు రెడ్‍ హ్యాండెడ్‍గా చిక్కారు. నిబంధనల ప్రకారం గడువు ముగిశాక ప్రచార బాధ్యతలను పక్కనబెట్టి సొంత ఊళ్లకు రావాల్సి ఉన్నా రాకుండా అక్కడ వీళ్లు వెలగబెట్టిన  ఘనకార్యాలు వీడియోలు, ఫొటోల రూపంలో సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో కొన్నిచోట్ల అక్కడి జనాల చేతిలో తన్నులు తిన్న గులాబీ తమ్ముళ్లను చూసి సొంత జిల్లాల్లోని పబ్లిక్​కు నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాలేదు.

వారం, పదిరోజుల ముందు నుంచే..

జీహెచ్​ఎంసీ ఎన్నికలను ప్రెస్టీజ్​ ఇష్యూగా తీసుకున్న టీఆర్​ఎస్​ హైకమాండ్..  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులకు డివిజన్ల బాధ్యతలను అప్పగించింది. ఆయా డివిజన్లను ఎట్టిపరిస్థితుల్లో గెలుచుకొని రావాలని ఆదేశించడంతో వారం, పదిరోజుల ముందే జిల్లాల నుంచి సెకండ్​క్యాడర్ లీడర్లను వెంటేసుకొని వెళ్లారు. వీళ్లలో జడ్పీటీసీలు,  ఎంపీపీలు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు వందలాది మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు.  వీరంతా ఆయా డివిజన్ల పరిధిలోని హోటళ్లలో అడ్డావేసి పెద్ద లీడర్ల డైరెక్షన్​ ప్రకారం  పొద్దంతా ప్రచారంలో పాల్గొంటూ, చీకటికాగానే ఓటర్లకు పైసలు,
లిక్కర్​ పంచుతూ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు, పబ్లిక్​కు రెడ్​హ్యాండెడ్​గా చిక్కారు.  కొన్నిచోట్ల లీడర్లను అక్కడి ప్రజలు చితక్కొడుతున్న వీడియో క్లిపింగ్​లు, ఫొటోలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తున్నాయి.

ఎమ్మెల్యే డబ్బులు పంచుతున్నాడని..

మహబూబాబాద్‍ ఎమ్మెల్యే శంకర్‍నాయక్‍ ఆదివారం రాత్రి తారామతి బారాదరి హోటల్లో తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున మనీ, లిక్కర్‍ బాటిళ్లు పంచుతున్నాడని గొడవ జరిగింది. హోటల్‍ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిస్థితి పరస్పర దాడులు, పోలీసుల అరెస్టుల దాకా వెళ్లింది.

మంచిర్యాల జిల్లా దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్​ గ్రేటర్​ ఎలక్షన్​లో టీఆర్ఎస్​ తరపున ఓటర్లకు పైసలు పంచుతూ దొరికిపోయాడు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు, నడిపెల్లి చారిటబుల్​ ట్రస్ట్​ చైర్మన్​ విజిత్​రావు ఆధ్వర్యంలో నియోజకవర్గ టీఆర్​ఎస్​లీడర్లు.. 95వ డివిజన్​ టీఆర్​ఎస్​ క్యాండిడేట్​కాజ సూర్యనారాయణ తరఫున క్యాంపెయిన్​ చేశారు. ఆదివారం పైసల పంపకాలు చేస్తుండగా ఎంపీపీ శ్రీనివాస్​ను స్థానికులు పట్టుకున్నారు. ‘ఎక్కడినుంచి వచ్చావ్​.. ఇక్కడికి ఎందుకొచ్చినవ్… నిన్ను ఎవరు పంపిన్రు’​ అంటూ నిలదీస్తున్న వీడియో  సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది. ఈ క్రమంలో ఆయన మొబైల్​, చైన్​, ఏటీఎం కార్డులు మిస్సయినట్లు తెలిసింది. 51, 52 బూత్​లలో లక్సెట్టిపేట వైస్​ ఎంపీపీ పొడేటి శ్రీనివాస్​, దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లి ఉప సర్పంచ్​ నలిమెల మహేష్​ డబ్బులు పంచడానికి వెళ్లగా, ఎంపీపీ శ్రీనివాస్​ను స్థానికులు పట్టుకున్న విషయం తెలిసి అక్కడినుంచి పరారైనట్లు కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.  

ప్రభుత్వ చీఫ్‍విప్‍ వినయ్‍భాస్కర్‍ అనుచరుడు.. వరంగల్‍ 39వ డివిజన్‍ కార్పొరేటర్‍ వేముల శ్రీనివాస్‍ డబ్బులు పంపిణీ చేస్తూ పబ్లిక్​కు చిక్కాడు. తాను వరంగల్‍ కార్పొరేటర్‍ అని కాకుండా తనది కరీంనగర్‍ అని రాంగ్‍ అడ్రస్‍ చెప్పడంపై సోషల్‍ మీడియాలో కామెంట్స్​ వచ్చాయి.

హైదరాబాద్​లో డబ్బులు పంచుతూ దొరికిన చొప్పదండి మండలం గుమ్లాపూర్​కు చెందిన  టీఆర్​ఎస్​ నేత కర్ర సందీప్​ తనను కొట్టవద్దని వేడుకున్నాడు..

నోట్ల కట్టలు, లిక్కర్​ బాటిళ్లతో ఎమ్మెల్యేల అనుచరులు..

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరుడు దామెర వైస్‍ ఎంపీపీ జకీర్‍ డబ్బులు పంచుతుండగా,  గొడవ జరిగిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్‍ అయింది.

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి అనుచరులు.. మహిళా కౌన్సిలర్ల భర్తలైన నాగిశెట్టి ప్రసాద్‍, రామసాయం సుధాకర్‍రెడ్డి సైతం అధికార పార్టీ తరఫున డబ్బులు పంచుతూ రెడ్‍ హ్యాండెడ్‍గా దొరికారు.

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అనుచరుడు రామడుగు మండలం తిర్మలాపూర్ కు చెందిన నర్సింగ్ బాబు, చొప్పదండి మండలం గుమ్లాపూర్ చెందిన కర్ర సందీప్ ఆదివారం 102 డివిజన్ లోని రెహమత్ నగర్ లో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్​ కార్యకర్తలు, స్థానికులు పట్టుకొని కొట్టడంతో గాయాలయ్యాయి. ఇదే ఘటనలో మల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ జనగాం శ్రీనివాస్, కొండగట్టు కు చెందిన పంజాల మల్లేశం  సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నుంచి వెళ్లిన వరదవెల్లి మాజీ సర్పంచ్ భర్త నాగుల శ్రీను, మర్లపేట ప్రస్తుత సర్పంచ్ భర్త గుడ్ల శ్రీను, బోయినిపల్లి సింగిల్ విండో డైరెక్టర్ ముద్దం రవి కూడా గాయపడ్డారు.

సూర్యాపేట జెడ్‌‌‌‌పి వైస్ చైర్మన్ గోసగాని వెంకట నారాయణ మన్సూరాబాద్ లో డబ్బులు పంచుతున్నట్లు బీజేపీ లీడర్లు ఆరోపించారు. అడ్డుకొని నిలదీయడంతో గోపాగని వెంకట నారాయణ అక్కడి నుండి చల్లగా జారుకున్నారు.

నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలానికి చెందిన టీఆర్​ఎస్​ లీడర్​ పాశం సత్తిరెడ్డి గడ్డిఅన్నారం ఏరియాలో ఓటర్లకు డబ్బులు, లిక్కర్​ పంచుతుండగా స్థానికులు పట్టుకున్నారు. నకిరేకల్​ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పంపిస్తే వంద మంది వరకు ప్రచారానికి వచ్చామని ఆయన చెప్పారు. నార్కట్​పల్లి ఎంపీపీ సురేందర్​ రెడ్డి చెబితే తామంతా ఇక్కడికి వచ్చామని అసలు విషయం బయటపెట్టారు.