రైతుల ఖాతాల్లో త‌క్ష‌ణ‌మే డ‌బ్బులు వేయాలి

రైతుల ఖాతాల్లో త‌క్ష‌ణ‌మే డ‌బ్బులు వేయాలి

కందులు కొనుగోలు చేసిన రైతుల ఖాతాల్లో డబ్బులు పడటంలేదని, తక్షణమే ఖాతాల్లో డబ్బులు పడేలా ఏర్పాట్లు చేయాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్. గురువారం ఆయ‌న రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై ఫోన్ లో సీఎస్ సోమేశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులను అదుకొని తగిన న్యాయం చేయాలని కోరాన‌న్నారు. రైతులకు వరి ధాన్యం కొనుగోలు కోసం బస్తాలను త్వరగా అందించాలని, కాంటలు , లోడింగ్, ఆన్ లోడింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కొన్ని చోట్ల డ్రా విధానం, కొన్ని చోట్ల టోకెన్ విధానం ఉండటం వల్ల రైతులు గందరగోళంలో ఉన్నారు, ఒకే విధానాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని చెప్పారు.

వరికి 1835 రూపాయల మద్దతు ధర ఇచ్చినప్పటికీ .. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ధాన్యాన్ని రైతలు తక్కువ ధరకు అమ్మేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన కందులను ప్రభుత్వం పేద వారికి సబ్సిడీపై అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధానాల్లో రేషన్ సామగ్రి రాష్ట్రంలో అందడం లేదని.. ఇతర రాష్ట్రాల వలస కూలీలు, కార్మికులకు బియ్యం , పప్పు, డబ్బులు అందించాలన్నారు.

రేషన్ పంపిణిలో అధికారులకు పూర్తి స్థాయి వివరాలు అందించక పోవడంతో గందరగోళం నెలకొందని.. దానికి ఒకే రేషన్ పాలసీని ప్రకటించాలన్నారు. లాక్ డౌన్ కాలంలో అత్యవసర సేవల కోసం ఫీల్డ్ అసిస్టెంట్స్ ను విధుల్లోకి తీసుకోవాలని.. బీజేపీ కార్యకర్తలు దేశం మొత్తం ప్రతి రోజు ఐదుగురికి నిత్యావసర వస్తువులు, అన్నదానం చేస్తున్నారని తెలిపారు. వారిని పోలీసులు ఇబ్బందులు పెట్టకుండా స్పెషల్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుండి కాలినడకన వచ్చే వారిపై పోలీసులు కఠినంగా కాకుండా కనికరం చూపించాలని తెలిపారు బండి సంజ‌య్.

ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ వద్ద పోలీస్ ఆఫీసర్ వలస కార్మికులను అడివిలో వదిలి రావడం దారుణమ‌ని.. ప్రైవేటు పాఠశాలల్లో, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు భరోసా ఇస్తూ ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరాన‌న్నారు. డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది పడుతున్న ఇబ్బందులపై లిఖిత పూర్వకంగా లేఖ ద్వారా అందిస్తానని ఈ సంద‌ర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కోరాన‌ని తెలిపారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు బీజేపీ మద్దతు ఉంటుందని తెలిపారు బండి సంజ‌య్.