
- ఎత్తిపోతున్న కాలం
- జూన్‌లో రాష్ట్రంలో ఎక్కడ పెద్దగా పడని వానలు
- 15 శాతం మించని సాగు.. 28 జిల్లాల్లో లోటు వర్షపాతం
- ఖమ్మం జిల్లాలో 72%, సిరిసిల్ల జిల్లాలో 66% లోటు
- వాడిపోతున్న మొలకలు.. తాగునీటికీ తప్పని తిప్పలు
- మరో రెండు మూడ్రోజుల్లో వర్షాలు పడొచ్చంటున్న వాతావరణ శాఖ
చెరువులల్ల చుక్క నీళ్లు లేవ్, బోర్లు ఎండిపోయినయ్, భూములు నెర్రలిస్తున్నయ్.. కాలంగాక ఎవుసం ఆగమయితున్నది. ఏరువాకకు ముందే పునాస కోసం దుక్కులుదున్నిన రైతులు గట్టివానల్లేక బుగులు వడుతున్నరు. లేట్‌గొచ్చిన నైరుతి నాలుగు చినుకులకే ఇగ వానలొస్తయని ఆశతోటి విత్తులేసిన రైతు గుండెపగులుతున్నడు.
హైదరాబాద్, వెలుగు:వానాకాలం మొదలై నెల రోజులవుతున్నా రాష్ట్రంలో చినుకు జాడ లేదు. తొలకరి చినుకులు వచ్చినట్లే వచ్చి ముఖం చాటేయడంతో రైతులు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. చినుకమ్మా.. కరుణించు అంటూ వేడుకుంటున్నారు. సాధారణంగా జూన్ మొదటివారంలో నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి 10వ తేదీలోగా మొత్తం విస్తరిస్తాయి. ఫలితంగా విస్తారంగా వర్షాలు పడుతాయి. కానీ ఈ ఏడాది రుతు పవనాలు రాష్ట్రంలోకి రావడమే పది, పదిహేను రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఈ నెల 20 వరకు ఎక్కడ కూడా వర్షాలు పడలేదు. దీంతో పంటసాగులో జాప్యమైంది. ఈ నెల 21, 22 తేదీల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. దాని ప్రభావంతో అక్కడక్కడ కొంచెం వర్షం పడింది. ఆ తొలకరి జల్లులకు రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. అప్పటికే దుక్కి దున్ని సిద్ధం చేసుకున్న పొలాల్లో తొలకరి వానకు విత్తనాలు విత్తుకున్నారు. ఇక ఢోకా లేదని ఖరీఫ్ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ.. అటు తర్వాత మొగులు అయినట్టే అయ్యి తేలిపోతోంది. రైతుల ముఖాలు చిన్నబోతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒకటీ రెండు జిల్లాలు మినహా ఇస్తే ఎక్కడ కూడా మళ్లీ వర్షం ముచ్చటే లేకుండా పోయింది. విత్తిన విత్తులు భూమిలోనే మాడిపోతున్నాయి. కొన్ని చోట్ల మొలకెత్తినా నీళ్లు లేక ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. వాటర్ ట్యాంకర్లు తెచ్చి బిందెలతో మొలకలకు నీళ్లు పోస్తున్నారు. అయినా లాభం ఉండటం లేదు. మరికొన్ని ప్రాంతాల్లోనైతే ఇంకా సాగు ప్రారంభమే కాలేదు. నాలుగు నెలల వర్షాకాలంలో జూన్ మొత్తం ఇలా చినుకు జాడ లేక ఎత్తిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాగు అంచనా: కోటీ 9 లక్షల ఎకరాలు, కానీ..?
రాష్ట్రంలో ఈ ఏడాది పునాసలో కోటీ 9 లక్షల ఎకరాల వరకు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే.. పునాస సీజన్ ప్రారంభమై దాదాపు నెల కావస్తున్నా ఇప్పటికీ 15 లక్షల ఎకరాల్లోనే సాగు మొదలైంది. అంటే 15శాతం కూడా సాగు మించలేదు. పత్తి 50 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు అంచనా వేయగా, 10 లక్షల ఎకరాలకు మించలేదు. పసుపు, చెరుకు, జొన్న పంటలు 30 వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. వేరుశనగ, పెసర, సోయాబీన్, ఆముదం పంటల సాగు కూడా అనుకున్నంతగా జరుగలేదు. ప్రధానపంట వరి సాగు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ ఖరీఫ్‌లో 30లక్షల ఎకరాల వరకు సాగు అంచనాలు వేయగా, ఇప్పటి వరకు 50 వేల ఎకరాల్లో కూడా వరినాట్లు పడలేదు. సాధారణంగా జూన్ చివరి నాటికి 50 శాతం వరి నాట్లు పూర్తి కావాల్సి ఉంటుంది.
28 జిల్లాల్లో లోటు వర్షపాతం
రాష్ట్రంలో ఈ జూన్‌లో 28 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 72 శాతం వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఈ జిల్లాలో జూన్‌లో సాధారణ వర్షపాతం 125.9 మిల్లీమీటర్లు కాగా కేవలం 35.2 మిల్లీ మీటర్లు నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాధారణ వర్షపాతం 148.3 మిల్లీ మీటర్లు కాగా 50.7 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదైంది. సిరిసిల్ల జిల్లాలో 66 శాతం వర్షపాతం లోటు ఉంది. కొత్తగూడెం జిల్లాలో జూన్‌లో సాధారణ వర్షపాతం 148.1 మిల్లీ మీటర్లు ఉండగా ఈసారి 53.5 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదైంది. ఇక్కడ 64 శాతం లోటు వర్షపాతం ఉంది. మహబూబాబాద్ జిల్లాలో 56 శాతం లోటు, వరంగల్ రూరల్ జిల్లాలో 56 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నల్గొండ, వరంగల్ అర్బన్ జిల్లాల్లో 54 శాతం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 50 శాతం, సూర్యాపేట జిల్లాలో 48 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 45 శాతం, యాదాద్రి భువనగిరి జిల్లాలో 42 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూల్ 5 శాతం లోటు, జనగాం జిల్లాలో 7 శాతం వర్షపాతం లోటు కనిపిస్తోంది. కాగా, జగిత్యాల జిల్లాలో సాధారణ వర్షపాతం 146 శాతం కాగా 159.4 శాతం నమోదైంది. దీంతో ఇక్కడ 9 శాతం అధికంగా వర్షం పడింది. కరీంనగర్‌లో సాధారణ వర్షపాతం కంటే 6 శాతం ఎక్కువగా పడింది. ఇక్కడ సాధారణ వర్షపాతం 127.5 శాతం కాగా 134.8శాతం నమోదైంది.
తాగునీటికీ తిప్పలే
మొన్నటివరకు ఎండాకాలంలో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. చెరువులు, కుంటలు, బావులు ఎండిపోయాయి. వాటర్ ట్యాంకుల కోసం జనం వేచి చూడాల్సిన పరిస్థితులు అనేక చోట్ల కనిపించాయి. వానాకాలం మొదలైతేనైఆ తిప్పలు తప్పుతాయని అందరూ భావించారు. కానీ.. వానాకాలం ప్రారంభమై నెల కావొస్తున్నా చినుకుల జాడ పెద్దగా కనిపించడం లేదు. చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఎప్పటిలానే కొనసాగుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తాగు నీటి అవసరాలను తీర్చే సింగూరు నీటి విడుదలను శుక్రవారం అధికారులు నిలిపివేశారు. సింగూరు రిజర్వాయర్‌లో నీళ్లు లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి రోజు విడిచి రోజు నీళ్లు సరఫరా చేసేవారు. కానీ.. ఇప్పుడు మూడు నాలుగురోజులకోసారి సరఫరా చేస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లోనే కాదు చాలా జిల్లాల్లోనూ తాగు నీటి సమస్య నెలకొంది. జూన్‌లో రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాల్సి ఉండగా.. వాటి గమనం మందగించిందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. జులై మొదటి వారంలో అవి పుంజుకుంటాయంటున్నారు. అల్పపీడన ప్రభావంతో మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ అంచనా వేసింది.