నెల రోజుల పాలన తృప్తినిచ్చింది : సీఎం రేవంత్ రెడ్డి

నెల రోజుల పాలన తృప్తినిచ్చింది  : సీఎం రేవంత్ రెడ్డి
  • ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నం: సీఎం రేవంత్ 
  • పాలకులం కాదు.. సేవకులమన్న మాట నిలబెట్టుకుంటున్నం 
  • రేవంతన్నగా నన్ను జనం గుండెల్లో పెట్టుకున్నరు
  • నెల రోజుల పాలన తృప్తిని, కొత్త అనుభూతిని ఇచ్చిందన్న సీఎం 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో నియంతృత్వపు సంకెళ్లను తెంచి కాంగ్రెస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛను పంచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ నెల రోజుల పాలన తనకు తృప్తిని, కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. 

‘‘సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తున్నాం. అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ సాగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది. పేదల గొంతు వింటూ.. యువత భవితకు దారులు వేస్తూ.. మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖాల్లో ఆనందాలు చూస్తూ.. రైతుకు భరోసా ఇస్తూ.. సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపు అడుగులు వేస్తోంది. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ.. పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ.. నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ.. మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగింది. రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యతను నిర్వర్తిస్తా’’ అని సీఎం పేర్కొన్నారు.  

ప్రజలకు దగ్గరగా పాలన: కాంగ్రెస్​ 

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అవిశ్రాంత ప్రజాపాలనను అందిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అన్ని వర్గాలకూ న్యాయం చేసేలా కార్యాచరణ కొనసాగుతున్నదని పేర్కొంటూ ఆదివారం ఆ పార్టీ ట్వీట్ చేసింది. ‘‘ప్రగతి భవన్ కంచెలు తెంచి.. సచివాలయానికి దారులు తెరిచాం. హామీల అమలుకు శ్రీకారం చుట్టాం. పారదర్శకత కోసం టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన, ఉద్యోగులకు సకాలంలో జీతాలు, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష, డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రణాళిక, సాగు చేసే రైతులకు భరోసా, శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం కల్పించడం, రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనం, ప్రజలకు నిరసన తెలిపేందుకు స్వేచ్ఛ, వృథా ఖర్చుల నియంత్రణ, ఆర్థిక ప్రగతి కోసం పరిశ్రమలకు ఆహ్వానం, కేంద్ర నిధులు, విభజన హక్కులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతర కృషి వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగిస్తున్నాం. నియంతృత్వానికి దూరంగా, ప్రజలకు దగ్గరగా ప్రజా ప్రభుత్వంలో ప్రజా పాలన నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది’’ అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్​లో పేర్కొంది.