15 శాతం టారిఫ్ లతో ఆసియా దేశాలకు మేలే.. మూడీస్ అనలిటిక్స్ రిపోర్ట్

15 శాతం టారిఫ్ లతో ఆసియా దేశాలకు మేలే.. మూడీస్ అనలిటిక్స్ రిపోర్ట్

న్యూఢిల్లీ:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 15 శాతం సుంకాల వల్ల ఆసియా పసిఫిక్ దేశాలకు మేలు జరుగుతుందని మూడీస్ అనలిటిక్స్ తెలిపింది. అమెరికా గతంలో చైనా వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులపై చాలా ఎక్కువ శాతం సుంకాలను విధించింది. 

కొన్ని సందర్భాల్లో ఇవి 25 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అన్ని దేశాలకు కలిపి ఒకేరకంగా 15 శాతం సుంకాన్ని అమలు చేయడం వల్ల చైనా, ఆగ్నేయాసియా దేశాలకు భారం తగ్గుతుంది. గతంలో ఉన్న అధిక సుంకాల కంటే ఈ 15 శాతం తక్కువ కావడం వీటికి ఊరట. జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఇప్పటికే అమెరికా 15 శాతం బేస్ రేటును వసూలు చేస్తోంది.  కొత్త నిబంధనల వల్ల ఈ దేశాలపై పెద్దగా ప్రభావం ఉండదు.  

చైనాపై సుంకాలు తగ్గడం వల్ల ఆ దేశ ఎగుమతులు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.  భారత్ విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వల్ల కొన్ని దేశాలకే పరిమితమైన ప్రత్యేక సుంకాలను విధించే అధికారం ఉండదు. ఇది భారత్, ఇండోనేషియా వంటి దేశాలతో జరిగిన పాత వాణిజ్య ఒప్పందాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం వంటి అంశాలు అమెరికాతో చర్చల్లో కీలకంగా మారాయి. ఈ అనిశ్చితి వల్లే భారత్ తన ప్రతినిధుల బృందాన్ని వాషింగ్టన్ పంపడాన్ని వాయిదా వేసింది.