
కంటకవనంలో ఉండే నక్క మహా మోసకారి. అడవిలో ఉన్న జంతువులన్నింటిని మోసం చేస్తూ జీవనం సాగిస్తుండేది. చూసి చూసి జంతువులు విసిగిపోయి రాజైన సింహానికి మొరపెట్టుకున్నాయి. దాంతో నక్కకు గుండెలదిరిపోయాయి. సింహం చండశాసనుడు.
నేరం రుజువైతే కఠినశిక్ష తప్పదు. దాంతో నక్కకు ఏమీ పాలుపోక ఎవరినైనా సాయం అడగాలనుకుంది. అందుకని రాజు దగ్గరకు వెళ్లకముందే తోడేలు దగ్గరకు వెళ్లి, తన బాధ చెప్పుకుంది నక్క. ఎలాగయినా రాజుగారి ముందు నిర్దోషిగా నిరూపించాలని తనకు ఏదైనా ఉపాయం చెప్పమని కోరింది.
అందుకు తోడేలు.. ‘‘ఉపాయం చెబుతాగాని నీ పనయ్యాక నాకు మంచి ప్రతిఫలం ఇవ్వాలి” అన్నది. ‘‘అలాగే” అని తలూపింది నక్క. తోడేలు నక్కతో సింహం ఏమడిగినా ‘‘తెలియదు.. గుర్తులేదు..’’ అని చెప్పమన్నది. అది మనసులో పెట్టుకుని రాజుగారి ముందుకు వెళ్లింది నక్క. సింహం రకరకాల ప్రశ్నలు సంధించింది. వాటిలో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా ‘‘తెలియదు.. గుర్తులేదు..’’ అని చెప్పి తప్పించుకుంది నక్క. విధిలేక సింహం నక్కను నిర్దోషిగా ప్రకటించి వదిలేసింది.
ఆ ఆనందంలో మునిగితేలుతోన్న నక్క దగ్గరకు తోడేలు వెళ్లి ‘‘నా ఉపాయం భలే పనిచేసింది కదా. మరి నాకు ఇస్తానన్న ప్రతిఫలం ఏది?”అని ఆశగా అడిగింది. దాంతో ఒక్కసారిగా నక్క ‘‘నేను.. నీకు.. ప్రతిఫలం ఇస్తానన్నానా? నాకేం.. తెలియదు, గుర్తులేదు’’ అంటూ బొంకింది.
ఆ మాటలకు అవాక్కయిన తోడేలు నక్కకు బుద్ధి చెప్పాలనుకుంది. ఇక లాభం లేదనుకుని తోడేలు సింహం దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పి, నక్క నేరాలన్నింటిని సాక్ష్యాలతో ఏకరువు పెట్టింది. అదంతా విన్న సింహానికి కోపం ముంచుకొచ్చింది. నక్కను పిలిచి ‘‘జంతువులన్నీ వాటి బాధను చెప్పుకుని న్యాయం చేయమని నా దగ్గరకి వస్తే.. నువ్వు నా నుంచి తప్పించుకోవాలి అని బాగానే ప్లాన్ చేశావ్. ఇక నీ ఆటలు సాగవు. నీ గురించి మొత్తం నాకు తెలిసిపోయింది. సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇక నిన్ను ఎవరూ కాపాడలేరు.
జంతువులన్నీ కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తున్న ఈ అడవిలో నీకు చోటు లేదు. నువ్వు చేసిన తప్పులకు నీకు వన బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను. తక్షణమే ఈ అడవి వదిలి వెళ్లిపోవాలి” అంటూ గర్జించింది.
సింహం మాటలకు హడలిపోయిన నక్క వెంటనే తమాయించుకుని.. ‘‘ప్రభూ నిన్న నన్ను మీరు నిర్దోషిగా ప్రకటించారు. ఇవాళ మళ్లీ మాట తప్పుతారా?” అన్నది. అందుకు సింహం ‘‘నాకేమీ తెలియదు.. గుర్తులేదు. ముందు నువ్వు ఈ అడవి నుంచి వెళ్లిపో. లేకపోతే పంజా దెబ్బ రుచి చూడాల్సి వస్తుంది” అన్నది.
సింహం తన మాటే తనకు అప్పచెప్పిందని నక్కకు అర్థమైంది. తోడేలు తనకు చెప్పిన ఉపాయం తనకే ఎసరు పెట్టింది అనుకుంది. ‘‘బతుకు జీవుడా!’’ అంటూ నక్క వేరే అడవిని వెతుక్కుంటూ పరుగు తీసింది. సింహం తోడేలుతో ‘‘తెలివితేటల్ని న్యాయాన్ని కాపాడటానికి వాడాలి. అంతేగాని దుర్మార్గాన్ని ప్రోత్సహించటానికి కాదు’’ అని మందలించి పంపేసింది.
- డా. గంగిశెట్టి శివకుమార్-