
మహేంద్రగిరి కొండల్లో చక్కని జలపాతం ఉంది. ఆ జలపాతం దగ్గర కొన్ని జింక పిల్లలు ఆనందంగా గంతులు వేస్తూ చలాకీగా ఆడుకుంటున్నాయి. ఇంతలో హఠాత్తుగా అక్కడికి మృగరాజు వచ్చింది. మృగరాజును చూసి జింక పిల్లలు గజగజ వణికిపోయాయి. ఎటువైపూ పరుగెత్తలేని పరిస్థితి.
అదే సమయంలో జలపాతం పైన ఉన్న కొండపై నుంచి ఒక తోడేలు ఈ దృశ్యం చూసింది. ‘‘ఈ రోజు అవి మృగరాజుకు విందు కాబోతున్నాయి”అని మనసులో అనుకుంది తోడేలు. వెంటనే పరుగు పరుగున జింకల కోనకు వెళ్లి జింకల పెద్దతో ‘‘జలపాతం దగ్గర జింక పిల్లలను మృగరాజు చంపి తినేస్తోన్నది” అని ఆయాసపడుతూ చెప్పింది.
ఒక్కసారిగా జింకల కోనలో ఉన్న జింకలన్నీ ఆందోళనతో దిక్కుతోచక ఏడ్వడం మొదలుపెట్టాయి. అవి కన్నీళ్లు పెట్టుకుంటూ భయంతో పరుగు పరుగున తోడేలు వెంట జలపాతం దగ్గరకు చేరుకున్నాయి. అవి పరుగు పెట్టడం చూసి ఏమైందో? అని అడవిలోని జంతువులు కూడా వాటి వెంట వచ్చాయి. ఆ ప్రదేశానికి వెళ్లి అక్కడి దృశ్యము చూసి తోడేలుతో సహా జింకలు, మిగిలిన జంతువులు నివ్వెరపోయాయి. జింకలు ఊపిరి పీల్చుకున్నాయి. జింకల మధ్యలో సరదాగా ఆడుకుంటున్న మృగరాజును చూసి ఆశ్చర్యపోయాయి.
మృగరాజు ఆదరాబాదరాగా వచ్చిన జింకలను, మిగతా జంతువులను చూసి మొదట ఆశ్చర్యపోయింది. తర్వాత మృగరాజు వాటితో సంతోషంగా ‘‘ఈరోజు ఈ జింక పిల్లలతో చాలా హాయిగా కాలక్షేపం అయింది. మనసుకు ప్రశాంతత లభించింది. చికాకులు తొలిగాయి. వారంలో ఒక రోజైనా పిల్లలతో గడిపితే ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకే ఈరోజు నుంచి వారంలో ఒకరోజు మనమంతా పిల్లలతో హాయిగా గడుపుదాం. ఈ విషయాన్ని పులి, సింహాలతోపాటు అన్ని జంతువులకు చెప్పండి” అని అంది.
మృగరాజు మాటలకు అక్కడికి చేరిన జంతువులన్నీ ముక్త కంఠంతో ‘‘సరే” అన్నాయి. మృగరాజు వెళ్లి పోయిన తర్వాత జింకల నాయకుడు తోడేలుతో ‘‘చూసిందల్లా నమ్మేసి తొందరపడి చెప్పకూడదు. కొన్ని విషయాలు చక్కగా పరిశీలించి నిజానిజాలు తెలుసుకొని చెప్పాలి. చూడు.. జింకలన్నీ కాసేపటిలో ఎంత అల్లాడిపోయాయో! అనవసరంగా అందర్నీ కంగారు పెట్టేశావు” అంది.
ఆ తర్వాత జింకలను చూస్తూ.. ‘‘అయినా మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. పిల్లలను అసలు పట్టించుకోకుండా వదిలేసి తిరగడం వల్ల ప్రమాదంలో పడ్డాయని తెలియగానే గుండె ఝల్లుమంది. ఇవాళ మృగరాజు మంచి మాట చెప్పారు. ఇక నుంచి మనం వారానికొక రోజు మన పిల్లలతో గడపాలి” అని అంది.
తోడేలు ‘‘అవును... నేను మృగరాజును అనవసరంగా అనుమానించాను. కానీ, ఇక్కడ కలలో కూడా ఊహించని దృశ్యం కనిపించింది. ఆశ్చర్యం, సంతోషంతో నా మనసు ఉప్పొంగుతోంది” అంది. అన్నీ కలిసి తమ నివాసాలకు బయల్దేరాయి. మరుసటి వారం నుంచే అడవిలో జంతువులన్నీ ఒకరోజు వాటి పిల్లలతో హాయిగా గడపసాగాయి.
–మొర్రి గోపి–