సర్వం కోల్పోయిన మోరంచపల్లి గ్రామస్తులు.. కట్టేసిన పశువులు అలాగే చనిపోయాయి

సర్వం కోల్పోయిన మోరంచపల్లి గ్రామస్తులు.. కట్టేసిన పశువులు అలాగే చనిపోయాయి

మోరంచపల్లి.. 300 ఇళ్లు.. 700 మంది గ్రామస్తులతో ఉన్న ఓ చిన్న గ్రామం. ఆకస్మిక వరదలతో ఇప్పుడు నిలువనీడ లేకుండా పోయింది. ఊరుకు ఊరు నీట మునిగి.. ఇప్పుడే తేరుకుంది. నీళ్లు వెళ్లిపోవటంతో అక్కడి వరద బీభత్సం.. సృష్టించిన భయానక పరిస్థితులు ఇప్పుడు అందరినీ కలిచి వేస్తున్నాయి. గ్రామంలోని ఇల్లు అన్నీ బురద మయంగా మారాయి. ఇంట్లోని వస్తువులు కొట్టుకుపోయాయి. ఇళ్లల్లోని సీలింగ్ ఫ్యాన్లకు చెత్తాచెదారం పట్టుకుంది. అంటే వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. 

ఈ గ్రామం నుంచి వరద వెళ్లలేదు.. ఈ గ్రామంలో ఇళ్లపై నుంచి నీళ్లు వెళ్లాయి అనేది ఇప్పుడు స్పష్టం అవుతుంది. ఇంట్లోని ఏ వస్తువూ ఇప్పుడు పని రాకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే కట్టుకున్న బట్టలతో రోడ్డుపైన ఉన్నారు గ్రామస్తులు.  నిన్నటి వరకు పాడి పశువులు, పాల వ్యాపారంతో ఎంతో ఆహ్లాదంగా ఉంటే మోరంచపల్లి ఇప్పుడు.. ఎక్కడ చూసినా పశువుల కబేళాలతో హృదయ విదారకరంగా ఉంది. ఇళ్ల ముందు కట్టెలకు కట్టేసిన పశువులు.. అలాగే చనిపోయి పడి ఉండటం అందర్నీ కన్నీళ్లు తెప్పిస్తుంది.

 వరద వచ్చిన సమయంలో తప్పించుకోలేక.. నీళ్ల నుంచి తప్పించుకోలేక.. గిలగిలాకొట్టుకుంటూ చనిపోయాయి పశువులు. గ్రామంలోని పశులు అన్నీ దాదాపు చనిపోవటం మరింత బాధాకరమైన విషయం. ఎద్దులు, ఆవులు, గేదెల కలేబరాలతో గ్రామంలో ఇప్పుడు దయనీయ పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఇల్లు నీట మునిగింది. సర్వం కోల్పోయారు మోరంచపల్లి గ్రామస్తులు. ఇప్పటికీ నలుగురు గ్రామస్తుల ఆచూకీ లభించకపోవటంతో.. డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టారు అధికారులు. 

ఇప్పుడు మోరంచపల్లి గ్రామస్తులు సర్వం కోల్పోయారు. ఇంట్లో ఓ ఒక్క వస్తువు పనికి రాకుండా పోయింది. జీవనాధారం అయిన పశువులు చనిపోయాయి. పొలాల్లో ఇసుక మేటలు వేసింది. ఇంట్లో వస్తువులే కాదు ఆధారం అయిన అన్ని సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి.. కనీసం తినటానికి నాలుగు గింజలు కూడా ఇంట్లో లేని పరిస్థితి. ఒకే ఒక్క రాత్రి.. ఆ గ్రామస్తులు సర్వం కోల్పోయారు.. వరద తగ్గిన తర్వాత ఇళ్లకు వచ్చిన బాధితులకు కన్నీళ్లు మిగిలాయి.. ఇప్పుడు మోరంచపల్లికి కావాల్సింది మనోధైర్యం.. మేం ఉన్నామన్న భరోసా..