బిర్యానీకే మస్తు ఆర్డర్లు

బిర్యానీకే మస్తు ఆర్డర్లు

ఆన్​లైన్​లో ఆర్డర్లు, రెస్టారెంట్లలో టేక్​అవేకి డిమాండ్​
మెయిన్​ హోటళ్లకే ఎక్కువ గిరాకీ.. తక్కువ సిబ్బందితో పని

రెస్టారెంట్​ బిర్యానీకి రెండు నెలలు దూరంగా ఉన్న జనం.. ఇప్పుడు మళ్లీ దానిని టేస్ట్​ చేస్తున్నారు. లాక్​డౌన్​ రూల్స్​ సడలించడం, రెస్టారెంట్లలో టేక్​అవే, ఆన్​లైన్​ ఫుడ్​ ఆర్డర్లకు ఓకే చెప్పడంతో మళ్లీ రెస్టారెంట్​ ఫుడ్డుకు డిమాండ్​ పెరిగింది. అటు ఆన్​లైన్​లో, ఇటు టేక్​అవే ఆర్డర్లు క్రమంగా ఎక్కువవుతున్నాయి. మొదట్రెండు రోజులు డల్​గానే ఉన్నా, ఇప్పుడు ఆర్డర్లు ఎక్కువగానే వస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్​ డెలివరీ యాప్​లకూ గిరాకీ పెరిగింది. అయితే, మామూలు రోజుల్లోలాగా ఇప్పుడు డెలివరీ బాయ్స్​ అంత ఎక్కువగా లేకపోతుండడం, ఆర్డర్లు ఎక్కువగా వస్తుండడంతో ఇబ్బందులొస్తున్నాయి.

హైదరాబాద్​ అంటే ముందు గుర్తొచ్చేది బిర్యానీనే. దానికి ఎంత క్రేజ్​ ఉందో అందరికీ తెలిసిందే. రెస్టారెంట్​కు వెళ్లినా, ఆన్​లైన్​లో ఆర్డర్​ పెట్టినా చాలా మంది మనసు పడేది బిర్యానీపైనే. రెండు నెలలుగా హైదరాబాద్​ బిర్యానీ రుచి తగలని జనం, ఇప్పుడు పసందైన ఆ బిర్యానీనే ఎక్కువగా తింటున్నారు. ఆర్డర్లు ఎక్కువగా దానికే పెడుతున్నారు. నిజానికి మాంసం తినేటోళ్లలో చాలా మంది వారంలో ఒకసారైనా బిర్యానీని టేస్ట్​ చేస్తుంటారు. అయితే, లాక్​డౌన్​తో చాలా మంది ఇళ్లలోనే తయారు చేసుకున్నారు. ఇంట్లో తయారు చేసుకున్నా రెస్టారెంట్​ బిర్యానీ టేస్ట్​ మాత్రం రావట్లేదంటున్నారు బిర్యానీ ప్రియులు.

మెయిన్​ రెస్టారెంట్లకే డిమాండ్​

ప్రస్తుతం బిర్యానీకి ఫేమస్​ అయిన పెద్ద పెద్ద రెస్టారెంట్లకే ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. పారడైజ్​, బావర్చీ, షాగౌస్​, కేఫ్​ బాహర్​, ఆదాబ్​ ఎక్స్​ప్రెస్​ వంటి వాటితో పాటు పేరు పొందిన కొన్ని రెస్టారెంట్లకు ఆన్​లైన్​, టేక్​అవే ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం కేవలం ఆన్​లైన్​, టేక్​అవేకి మాత్రమే అనుమతి ఉండడంతో మామూలు రోజులతో పోలిస్తే సేల్స్​ తక్కువగానే ఉన్నాయి. అయితే, తక్కువ స్టాఫ్​తో పనిని నెట్టుకొస్తున్నాయి రెస్టారెంట్లు. మామూలు రోజుల్లో హోటల్​ మెయింటెనెన్స్​, వెయిటర్స్​, స్వీపర్లు, చెఫ్​లు, సర్వీస్​ బాయ్స్​ వంటి వాళ్లెందరో పనిచేస్తుంటారు. ఇప్పుడు కేవలం చెఫ్​లు, సర్వీస్​బాయ్స్​తోనే రెస్టారెంట్లను నడుపుతున్నారు.