రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిర్మల్, నాగర్ కర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాన కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.
మరోవైపు హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, చందానగర్, శేరిలింగంపల్లి, నాంపల్లి, గోషామహల్, అల్వాల్, ఖైరతాబాద్, మెహదీపట్నం సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వానలు పడుతున్నాయి. హైదరాబాద్ సిటీలో నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు వర్షం దంచికొట్టింది.
