
- భవిష్యత్తులోనూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి
- ఆర్టీసీ ఉద్యోగులకు ఎండీ సజ్జనార్ దిశా నిర్దేశం
- ఫిట్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగులతో వర్చువల్ గా భేటీ
హైదరాబాద్,వెలుగు: వేతన సవరణతో ఆర్టీసీ ఉద్యోగుల బాధ్యత మరింత పెరిగిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులోనూ కష్టపడి పని చేయాలని ఉద్యోగులకు ఆయన సూచించారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న పీఆర్సీ కల సాకారమైన ఈ సందర్భం చరిత్రత్మాకమని ఆయన అభివర్ణించారు.
2017 వేతన సవరణలో భాగంగా 21 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో బస్ భవన్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బందితో ఎండీ వర్చువల్‌గా ముఖాముఖి నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో పెండింగ్ లో ఉన్న ప్రతి అంశాన్ని పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.
‘‘ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి మెరుగైన, నాణ్యమైన సేవలందించేలా కృషి చేయాలి. జాతీయ స్థాయిలో సంస్థకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. సంస్థపై ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి”అని ఎండీ అన్నారు.