
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అలాస్కాలో శుక్రవారం జరగనున్న చర్చలు విఫలమైతే భారత్‌పై మరిన్ని టారిఫ్ లు వేసే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘చర్చలు సానుకూలంగా సాగకపోతే రెండో దశ టారిఫ్‌లు పెంచవచ్చు” అని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇండియాపై ఇప్పటికే 50% సుంకాలు విధించినట్టు తెలిపారు.
చైనా కూడా రష్యా నుంచి పెద్ద ఎత్తున క్రూడాయిల్కొంటున్న విషయాన్ని ప్రశ్నించగా.. తమ టేబుల్‌పై అన్ని ఆప్షన్లు ఉన్నాయన్నారు. చైనాపై టారిఫ్‌ల అంశం కూడా ట్రంప్ చేతుల్లో ఉందన్నారు. అలాగే యూరప్ దేశాలు సెకండరీ శాంక్షన్లలో చేరాలని కోరారు. కాగా, ఇండియా-–అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఇటీవల నిలిచిపోయాయి. మళ్లీ ఆగస్టు 25న ప్రారంభమయ్యే చాన్స్ ఉంది. అయితే, ఇండియాపై విధించిన 50 టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ టారిఫ్‌లు అన్యాయమైన, అసమంజసమైన అంశంమంటూ భారత్వ్యతిరేకిస్తున్నది.
నేడు అలాస్కాలో ట్రంప్, పుతిన్ భేటీ
ట్రంప్, పుతిన్ అమెరికాలోని అలాస్కాలో శుక్రవారం సమావేశం కానున్నారు. తమ అధీనంలోని వాటితోపాటు మరికొన్ని ఉక్రెయిన్ భూభాగాలను చేజిక్కించుకోవాలని పుతిన్ బలంగా కోరుకుంటున్నారు. ట్రంప్ గత కొన్ని రోజులుగా ప్రపంచ శాంతి స్థాపకుడిగా గుర్తింపు కోరుకుంటున్నట్టు ప్రకటనలు చేస్తున్నారు. అదే సమయంలో ఈ సమావేశంలో జరిగే చర్చల్లో ట్రంప్ ఏయే అంశాల్ని ప్రస్తావిస్తారనేది ఊహించడం సులువు కాదని చెప్తున్నారు.