ఐదురోజుల వానకు అంతా ఆగం.. 80కిపైగా ఊర్లకు రాకపోకలు బంద్​

ఐదురోజుల వానకు అంతా ఆగం.. 80కిపైగా ఊర్లకు రాకపోకలు బంద్​
  • గూడు చెదిరిన 30 వేల మంది
  • దెబ్బతిన్న రోడ్లు.. కూలిన ఇండ్లు
  • భయం గుప్పిట్లో ముంపు ప్రాంతాల ప్రజలు
  • రూ.250 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా

హైదరాబాద్, వెలుగు:  వరుసగా ఐదురోజులు రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు, పోటెత్తిన వరదలకు జనజీవనం స్తంభించిపోయింది. దాదాపు 30 వేల మంది గూడు చెదిరి నిరాశ్రయులయ్యారు. వాగులు పొంగిపొర్లుతుండటం, ఎగువ నుంచి వరద నీరు వస్తుండటంతో పలు ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతిన్నాయి. శనివారం కొద్దిగా వాన తెరిపినిచ్చినా రెండు, మూడు రోజుల తర్వాత మళ్లీ భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు మరింత భయపడుతున్నారు. ఇప్పటికే సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు ఇంకా వరద నీటిలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,754 ఇండ్లు దెబ్బతిన్నాయి. ఇందులో దాదాపు 200 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. జీహెచ్​ఎంసీ పరిధిలోనే 500కు పైగా ఇండ్లు దెబ్బతిన్నట్లు తేలింది. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా నష్టం రూ.250 కోట్లు దాటినట్లు ఆఫీసర్లు తెలిపారు. వర్షాలు, వరదలపై కేంద్రానికి రాష్ట్ర సర్కార్​ ఇంకా ఎలాంటి లెటర్​ రాయలేదని తెలిసింది. వరద ఉధృతి అంతకంతకూ పెరిగితే దాదాపు 4 లక్షల మందిపై ఎఫెక్ట్​ పడుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు. 

నిలిచిపోయిన రాకపోకలు

వాగులు, లో లెవల్‌‌‌‌ వంతెనలపై వరదనీరు పొంగిపొర్లుతుండటంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80కి పైగా ఊర్లకు వరద నీటి కారణంగా రాకపోకలు స్తంభించాయి.  తాండూరులోని కాగ్నా, కొకట్, గాజీపూర్, బెల్కటూరు, రాంపూర్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా దోర్నాల వాగుతో నాగారం, అంపల్లి, గురుదొట్ల, రాస్నం, పగిడాల గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆసిఫాబాద్​ జిల్లా బెజ్జూరు మండలంలోని కుశ్నపల్లి, సోమిని గ్రామాల మధ్య  వరదనీరు రావడంతో వాగు అవతల ఉన్న గ్రామాలకు రాకపోకలు బంద్​ అయ్యాయి.  కాటారం నుంచి మేడారానికి వెళ్లే రహదారి మధ్యలోని కేశవాపూర్-, పెగడపల్లి గ్రామాలకు,  దొబ్బలపాడు, యామన్ పల్లి, దౌత్పల్లి, నిమ్మగూడెం, యత్నారం గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. 

దెబ్బతిన్న రోడ్లు..చెరువులకు బుంగలు

వరదల వల్ల కొన్ని చెరువులకు బుంగలు పడ్డాయి.  మొత్తంగా ఇప్పటివరకు 95  చెరువులు, ట్యాంకులు, కెనాల్స్​ , ప్రాజెక్టులు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు రిపోర్ట్​ ఇచ్చారు. వీటి రిపేర్ల కోసం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని నివేదించారు. రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. అయితే ఈ నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. అధికారులు చెప్తున్న దాని ప్రకారం.. పంచాయతీరాజ్‌‌‌‌ రోడ్లు 160  కిలో మీటర్ల మేర  దెబ్బతిన్నాయి. 55 చోట్ల రోడ్లు తెగిపోయాయి. కొన్ని చోట్ల సీడీ వర్క్స్​కు నష్టం వాటిల్లింది.  43 చోట్ల ఆర్‌‌‌‌ అండ్​ బీ రోడ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల బీటీ రోడ్లు కూడా దెబ్బతిన్నాయి.  ఇక లైట్లు, వాటర్​ పైప్​లు, డ్రైనేజీ, ఇతరత్రా వంటి వాటికి నష్టం వాటిల్లినట్లు మున్సిపల్​ అండ్​ అర్బన్​ డెవలప్​మెంట్​ డిపార్ట్​మెంట్​ నివేదించింది. కొన్నిచోట్ల విద్యుత్​ సబ్‌‌‌‌స్టేషన్లలోకి నీళ్లు చేరి..ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు, కరెంటు స్తంభాలు కొట్టుకుపోయాయి. 

ప్రకటనలే తప్ప సాయంలేదు

భారీ వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూలు, ప్రకటనలు చేయడం తప్ప అదే స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిరుడు జులైలో భారీ వర్షాలు, వరదలతో నాలుగైదు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం కేసీఆర్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ముంపు ప్రాంత ప్రజలకు ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. వరద ప్రభావం లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఏడాది అవుతున్నా ఇంతవరకు ఆ దిశగా ఒక్క  అడుగు పడలేదు. ఇప్పుడు కూడా ఉన్నతాధికారులు నివేదికల రూపంలో ముందస్తు హెచ్చరికలు చేస్తున్నా.. అందుకు తగిన విధంగా ప్రభుత్వం నిధులు రిలీజ్​ చేయడం లేదు. సహాయక చర్యల విషయంలోనూ అలర్ట్​గా ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విపత్తు నిర్వహణకు కేంద్రం ఇచ్చే నిధులకు తోడు రాష్ట్ర సర్కార్​ కూడా కొంత నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చుద్దాంలే అన్న ధోరణిని అవలంబిస్తున్నది. 

40కి పైగా గ్రామాలకు ముంపు!

భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్​, మహబూబాబాద్​, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్​, వికారాబాద్​ జిల్లాల్లో వరద ముంపు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆఫీసర్లు అలర్ట్​ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో 40కి పైగా గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే.. ఈ జిల్లాల్లో వర్షాలు అధికమై వరదలు పెరిగితే అప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టేందుకు వీలుపడదని ప్రభుత్వానికి ఆఫీసర్లు నివేదించినట్లు తెలిసింది. తగిన ఏర్పాట్లు ముందస్తుగానే చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం.