
- ఎక్కువగా తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రల్లోనే
- వాటితో ఉన్న చారిత్రక సంబంధాలే కారణం
హైదరాబాద్, వెలుగు:దేశంలో కోటి మందికి పైగా తెలుగోళ్లు పక్క రాష్ట్రాల్లోనే బతుకుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో తెలుగు మాట్లేడే వారు 8,11,27,740 మంది. అందులో కోటి 4 లక్షల 59 వేల 960 (13%) మంది వివిధ రాష్ట్రాల్లో ఉంటున్నారు. తెలుగోళ్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ముందు వరుసలో ఉంది. అక్కడ 42,34,302 మంది ఉన్నారు. ఆ తర్వాత కర్ణాటకలో 35,69,400 మంది, మహారాష్ట్రలో 13,20,880 మంది, ఒడిశాలో 6,67,693 మంది ఉన్నారు. అతి తక్కువగా లక్షద్వీప్‌లో 42 మంది ఉన్నారు. మిజోరాంలో 334 మంది, డయ్యూ డామన్‌లో 464 మంది ఉన్నారు.
అందుకే అక్కడ ఎక్కువ
తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలో తెలుగోళ్లు ఎక్కువగా ఉండడానికి కారణం, ఆయా రాష్ట్రాలతో మనకున్న చారిత్రక సంబంధమేనంటున్నారు కాకతీయ యూనివర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్ టి.శ్రీనివాస్ తెలిపారు. ‘‘అప్పట్లో మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలుండేవి. పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో 1953 నవంబర్1న మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడినా కొందరు తెలుగు వాళ్లు మాత్రం అక్కడే స్థిరపడ్డారు. అందుకే అక్కడ తెలుగువారి జనాభా ఎక్కువుంది. కర్నాటక, మహారాష్ట్రతోనూ అంతే విడదీయలేని బంధం మనది. నిజాం సంస్థానం ఇప్పటి తెలంగాణ రాష్ట్రంతోపాటు కర్నాటకలోని బీదర్, గుల్బర్గా, రాయచూర్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాందేడ్ తదితర ప్రాంతాల్లో విస్తరించి ఉండేది. దేశంలో నిజాం సంస్థానం విలీనం అవడం, రాష్ట్రాల పునర్విభజన జరగడంతో ఆ ప్రాంతాలన్నీ ఆయా రాష్ట్రాల పరిధిలోకి వెళ్లాయి. అందుకే అక్కడా తెలుగు మాట్లాడేవాళ్లు ఎక్కువే. ఉత్తరాంధ్ర సరిహద్దుల్లోని ఒడిశా (బరంపురం)లోనూ తెలుగువారు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు” అని ఆయన చెప్పారు.
నాలుగో స్థానంలో మనం
- తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పథకాల కారణంగా జనాభా తగ్గుతూ వస్తోంది. ఆ కారణంగా తెలుగు మాట్లాడే వాళ్ల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది.
- 1961 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎక్కువగా మాట్లాడే హిందీ తర్వాత, రెండో స్థానంలో తెలుగు ఉండేది. బెంగాలీ మూడో స్థానంలో ఉండేది.
- ఇప్పుడు బెంగాలీ, మరాఠీ తరువాతి స్థానంలో తెలుగు ఉంది.
- 1971 జనాభా లెక్కల్లో బెంగాలీ మనల్ని దాటేసింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు మూడో స్థానంలోనే ఉండేది.
- 2011 నాటికి తెలుగు రాష్ట్రాల్లో జనాభా బాగా కంట్రోల్ కావడంతో మిగతా వారితో పోలిస్తే తెలుగు మాట్లాడేవారి సంఖ్య తగ్గింది. ప్రస్తుతం దేశంలో 52.83 కోట్ల మందితో హిందీ (43.63%) మొదటి స్థానంలో ఉంది. 9.72 కోట్ల మంది (8.03%)తో బెంగాలీ రెండు, 8.3 కోట్ల మందితో (6.86%) మరాఠీ మూడు, 8.11 కోట్ల మందితో (6.7%) తెలుగు నాలుగో స్థానంలో ఉన్నాయి.
- 30 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్, అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అది కూడా తెలుగు మాట్లాడే వాళ్ల సంఖ్య తగ్గడానికి కారణమని తెలుస్తోంది.