అఫ్గాన్ల ఆకలి కేకలు

అఫ్గాన్ల ఆకలి కేకలు

కాబూల్: అఫ్గానిస్తాన్ లో తాలిబాన్ల పాలనకు 100 రోజులైంది. ఈ మూడు నెలల్లో అఫ్గాన్ ఆగమైపోయింది. దేశంలో ఫుడ్ క్రైసిస్ మరింత ఎక్కువైంది. పల్లెలు సహా పట్టణాల్లోనూ ఆహార సంక్షోభం తలెత్తింది. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోవడంతో ఆగస్టు 15న తాలిబాన్లు దేశాన్ని ఆక్రమించుకున్నారు. వాళ్లు పగ్గాలు చేపట్టిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. తాలిబాన్లు మానవ హక్కులను ఉల్లంఘించడం, అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించకపోవడంతో... విదేశాలు ఆర్థిక సాయాన్ని నిలిపివేశాయి. ప్రస్తుతం తాలిబాన్ సర్కార్ ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించలేని స్థితిలో ఉంది. దేశంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫుడ్ కొనుక్కునేందుకు జనం ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. పేదలతో పాటు మధ్య తరగతి ప్రజలకు సైతం పూట గడవట్లేదు. చాలామందికి ఒక్క పూట అన్నం కూడా దొరకట్లేదు. అఫ్గాన్ జనాభా 3.90 కోట్లు కాగా, వారిలో 2.28 కోట్ల మంది ఆకలితో అల్లాడుతున్నారని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ చెప్పారు. రెండు నెలల క్రితం ఈ సంఖ్య కేవలం 1.40 కోట్ల మాత్రమేనని తెలిపారు. రోజురోజుకూ ఆహార సంక్షోభం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.   

పిల్లలు ఏడుస్తున్నరు..
అఫ్గాన్ లో తిండి దొరక్క పిల్లలు అల్లాడిపోతున్నారు. ‘‘మేమంటే పస్తులుంటం. కానీ పిల్లలు తిండి లేక ఏడుస్తున్నరు. వారికి ఏం పెట్టాలో అర్థం కావడం లేదు” అని కాబూల్​కు చెందిన ఇద్దరు పిల్లల తల్లి జర్ఘునా వాపోయారు. ‘‘మేం రోజూ పొద్దున టీ తాగుతున్నం. రాత్రికి ఒక్కపూటే తింటున్నం. ఒక్కోసారి అది కూడా ఉండడం లేదు” అని చెప్పారు. నిత్యావసరాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, దీంతో కొన్ని రోజులుగా వట్టి పిండినే తింటున్నామని జర్ఘునా వాపోయారు.