ఎన్నికల వేళ లగ్గాల టెన్షన్..నవంబర్లోనే లక్షకు పైగా ముహూర్తాలు

 ఎన్నికల వేళ లగ్గాల టెన్షన్..నవంబర్లోనే లక్షకు పైగా ముహూర్తాలు
  • పోలింగ్​ ముందు రోజూ భారీగా వివాహాలు
  • పోలింగ్​ శాతం తగ్గుతదేమోనని అభ్యర్థుల్లో బుగులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులకు లగ్గాల టెన్షన్ పట్టుకుంది. ఎన్నికల నెల నవంబర్​లో దాదాపు రెండు లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో పెళ్లిళ్ల హడావుడిలో ప్రజలు ఓటు వేయడం మర్చిపోతారేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల​30వ తేదీన పోలింగ్​జరగనుండగా, 29వ తేదీ కూడా పెళ్లిళ్లు ఉన్నాయి. ఈపెళ్లిళ్ల ఎఫెక్ట్ ఎన్నికల్లో ఉంటుందని అభ్యర్థులు కలవరపడుతున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొనడంతో ప్రతీ ఓటు కీలంకంగా భావిస్తున్న అభ్యర్థులకు ఈ పెళ్లిళ్ల సీజన్​ కొంత ఇబ్బంది పెడుతోంది. ఈసారి శ్రావణ మాసంలో పెద్దగా ముహుర్తాలు లేవు. అక్టోబర్15 నుంచి ప్రారంభమైన ఆశ్వయుజ మాసంలో అడపాదడపా వివాహాలు జరిగాయి. ఈ నెలలో 3వ తేదీ నుంచి 30వ తేదీ దాకా13 రోజులు పెళ్లి ముహుర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ప్రధానంగా14 నుంచి మొదలుకానున్న కార్తీకమాసంలో 8 రోజులు మంచి ముహుర్తాలు ఉన్నాయంటున్నారు. నవంబర్16, 19, 21, 22, 23, 24, 26, 29 తేదీల్లో ఎక్కువ లగ్గాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నెలలో తెలంగాణలో లక్షకు పైనే లగ్గాలు జరగనున్నాయి. నవంబర్​30 పోలింగ్​తేదీ కాగా, 29న కూడా లగ్గాలు ఉన్నాయి. పెళ్లి తరువాత రిసెప్షన్​తదితర కార్యక్రమాలు ఉంటాయి. ఈ లెక్కన 29వ తేదీన పెళ్లిళ్లు జరిగితే వాటి ప్రభావం 30వ తేదీ పోలింగ్​మీద ఉంటుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 

గ్రేటర్​లో సెటిలర్ల ఓట్లు..

గ్రేటర్​హైదరాబాద్ లోనే  50 వేలకు పైగా పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇవే కాకుండా ఆంధ్రా, తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లక్షల్లో పెళ్లిళ్లు జరగనున్నాయి. అలా ఇతర చోట్ల పెళ్లిళ్లకు వెళ్లినవారు తిరిగి మర్నాడే చేరుకోలేరు. దీంతో సిటీలో ముఖ్యంగా సెటిలర్స్ కొంత ఓటింగ్​కు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇదివరకు జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్​పోలింగ్ 50 శాతానికి మించలేదు. ఇప్పడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆ శాతం మరింత తగ్గే అవకాశం ఉంటుదని గ్రేటర్​అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.

రాజస్థాన్​లో ఎన్నికల తేదీ మార్పు

కేంద్ర ఎన్నికల కమిషన్​ తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్​, మిజోరం, చత్తిస్​గఢ్​ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ను అక్టోబర్​9న ప్రకటించింది. ఈ షెడ్యూల్​లో భాగంగా రాజస్థాన్​లో పోలింగ్​తేదీని నవంబర్ 23గా నిర్ణయించింది. అయితే ఆ రోజు ఆ రాష్ట్రంలో భారీ సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. దాదాపు 25 లక్షల మంది పెళ్లిళ్ల కారణంగా పోలింగ్​కు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల సంఘం పోలింగ్​తేదీని నవంబర్​23 నుంచి 25కు మారుస్తూ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో పోలింగ్​తేదీన పెళ్లిళ్లు ఎక్కువ లేవు. అయినప్పటికీ పోలింగ్​కు ముందు జరిగే పెళ్లిళ్ల ఎఫెక్ట్​ ఓటింగ్ శాతాన్ని ప్రభావం చూపతుందేమోనని అభ్యర్థులు భావిస్తున్నారు.