ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన, ఆర్థికమాంద్యం భయాలు టెక్ కంపెనీలతో పాటు అన్ని మల్టీనేషనల్ కంపెనీలను కలవరపరుస్తున్నాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లేఆఫ్స్ జాబితాలో మరో కంపెనీ చేరేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ కూడా తన ఉద్యోగులను తొలగించే ప్లాన్లో ఉంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా లేకపోవడం, ఒప్పందాల కొరత మధ్య ఆరు నెలల్లో రెండో రౌండ్ ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
3వేల మందికి ఉద్వాసన
అగ్రశ్రేణి బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన రెండవ రౌండ్ ఉద్యోగాల కోతలో దాదాపు 3,000 ఉద్యోగాలను తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు నివేదించబడింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం మోర్గాన్ స్టాన్లీలోని వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఆర్థిక సలహాదారులు .. వారికి మద్దతు ఇచ్చే సిబ్బందిపై ప్రభావం చూపుతుందని నివేదిక పేర్కొంది. దాదాపు 82,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్న మోర్గాన్ స్టాన్లీ ఈ నివేదికపై వ్యాఖ్యానించలేదు. కఠినమైన ఆర్థిక పరిస్థితులే ఉద్యోగుల తొలగింపుకు కారణం అవుతున్నాయని కంపెనీ చెబుతోంది. గడిచిన త్రైమాసికంలో మోర్గాన్ స్టాన్లీ మొత్తం రాబడిలో దాదాపుగా 2 శాతం అంటే 14.5 బిలియన్ డాలర్లు తగ్గాయి.
