శవాల దిబ్బ ..2,122 కి చేరిన మొరాకో భూకంప మృతుల సంఖ్య

శవాల దిబ్బ ..2,122 కి చేరిన మొరాకో భూకంప మృతుల సంఖ్య
  • 2,421 మందికి గాయాలు.. 1,404 మంది పరిస్థితి విషమం
  • అట్లాస్ పర్వత ప్రాంతాల్లోని గ్రామాలు సర్వనాశనం
  • ఇండ్లు కూలిపోయి టెంట్ల కింద ఉన్న జనం 
  • ఘోరంగా దెబ్బతిన్న మారకేశ్, మౌలే బ్రహిం పట్టణాలు 

మారకేశ్ (మొరాకో): మొరాకో శవాల దిబ్బగా మారింది. భూకంపం ధాటికి మారకేశ్, దాని చుట్టుపక్కల ఉన్న ఐదు ప్రావిన్సులు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఊర్లకు ఊర్లే నాశనమయ్యాయి. పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోయాయి. శిథిలాల నుంచి వెలికితీసే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. మృతుల సంఖ్య 2,122కు పెరిగిందని మొరాకో ప్రభుత్వం ప్రకటించింది. మరో 2,421 మంది గాయపడ్డారని తెలిపింది. వీరిలో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా మూడ్రోజులు సంతాప దినాలు ప్రకటించింది. 


ఒక్క అల్ హౌజ్ ప్రావిన్స్ లోనే 1,293 మంది చనిపోయారని, టారౌడెంట్ ప్రావిన్స్ లో 452 మంది మరణించారని మొరాకో ప్రభుత్వం తెలిపింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వర్కర్లు, రెడ్ క్రాస్ సొసైటీ వలంటీర్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మిలటరీ కూడా రంగంలోకి దిగింది. విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను మోహరించింది. అయితే భూకంప ధాటికి పర్వత ప్రాంతాల్లోని గ్రామాలు ఘోరంగా దెబ్బతినగా, అక్కడికి వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. కొండచరియలు విరిగిపడి రోడ్లు బ్లాక్ అయ్యాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. కాగా, భూకంప ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగిందని.. అవి తిరిగి కోలుకోవడానికి ఏండ్లకేండ్లు పడుతుందని రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు. 

ఊళ్లకు ఊళ్లే దెబ్బతిన్నయ్.. 

భూకంప ధాటికి అట్లాస్ పర్వత ప్రాంతాల్లోని గ్రామాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. కొన్ని ఊళ్లు అయితే నామరూపాల్లేకుండా పోయాయి. చాలా వరకు మట్టితో కట్టిన ఇల్లులే కాగా అవన్నీ కూలిపోయాయి. అక్కడి జనం సర్వస్వం కోల్పోయి అల్లాడుతున్నారు. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇండ్లు లేక.. వీధుల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మారకేశ్ తో పాటు దానికి దగ్గర్లోని టూరిస్ట్ ప్లేస్ మౌలే బ్రహిం పట్టణం పూర్తిగా శిథిలమైంది. ఇక్కడ కొన్ని ఇండ్లు పూర్తిగా కూలిపోగా, మరికొన్ని దెబ్బతిన్నాయి. ప్రజలందరూ ఇండ్లను వదిలి, గ్రామం మధ్యలో టెంట్ వేసుకుని ఉంటున్నారు. పది సెకండ్లలో తాము సర్వస్వం కోల్పోయామని స్థానికుడు అయూబ్ టౌడిట్ వాపోయాడు. కొన్ని ఇండ్లు కూలిపోయాయని, మరికొన్ని బీటలు వారాయని.. వాటిల్లో ఉండే పరిస్థితి లేదని ఆవేదన చెందాడు. తమకు ఆహారం, అంబులెన్స్ లు పంపించాలని వేడుకున్నాడు. పర్వత ప్రాంతాల్లోని మరో గ్రామం తఫేఘ్తే కూడా నామరూపాల్లేకుండా పోయింది. ఈ ఒక్క ఊళ్లోనే 70 మంది చనిపోయారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నోళ్ల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా, భూకంపంతో చాలామంది అయినవాళ్లను కోల్పోయారు. ‘‘నా ముగ్గురు మనవలు, కోడలు చనిపోయారు. డెడ్ బాడీలు ఇంకా శిథిలాల కిందే ఉన్నాయి” అని ఒమర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను 10 మంది కుటుంబసభ్యులను పోగోట్టుకున్నానని హౌదా ఔట్సాఫ్ వాపోయింది.

సాయానికి ముందుకొచ్చిన అల్జీరియా.. 

అల్జీరియా, మొరాకో మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. అయినప్పటికీ మొరాకోకు సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అల్జీరియా ప్రకటించింది. మానవతా ద్పక్పథంతో తమ ఎయిర్ స్పేస్ ను ఓపెన్ చేస్తామని తెలిపింది. అల్జీరియాతో పాటు భారత్, అమెరికా తదితర దేశాలు కూడా సాయం చేస్తామని ప్రకటించాయి. కాగా, బాధితులకు అవసరమైన మెడికల్ సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎంఎస్ఎఫ్ (డాక్టర్స్ వితౌట్ బార్డర్స్) సంస్థ తెలిపింది. 

మనోళ్లందరూ సేఫ్..

మొరాకోలోని మనోళ్లందరూ క్షేమంగా ఉన్నారని అక్కడి ఎంబసీ తెలిపింది. ఇప్పటి వరకు మన దేశస్తులెవరూ చనిపోయినట్టు గానీ, గాయపడినట్టు గానీ రిపోర్టులు లేవని చెప్పింది. ‘‘మొరాకోలోని ఇండియన్లు అందరూ లోకల్ అధికారులు జారీ చేసిన గైడ్ లైన్స్ పాటించాలి. ఎవరికైనా సాయం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి” అని ఎంబసీ పేర్కొంది. .