టాయిలెట్లు లేని స్కూళ్లు తెలంగాణలోనే ఎక్కువ  

టాయిలెట్లు లేని స్కూళ్లు తెలంగాణలోనే ఎక్కువ  

హైదరాబాద్,వెలుగు:రాష్ట్రంలోని చాలా సర్కార్ బడుల్లో కనీస సౌలతులు కరువయ్యాయి. 2,124 స్కూళ్లలో స్టూడెంట్లకు టాయిలెట్ సౌకర్యం లేదు. రాష్ట్రంలోని11,124  గవర్నమెంట్ స్కూళ్లలో తాగేందుకు మంచినీళ్లు కూడా లేవు. దేశవ్యాప్తంగా టాయిలెట్లు లేని స్కూళ్లు మొత్తం 12 వేలు ఉంటే అందులో 17 శాతం స్కూళ్లు తెలంగాణకు చెందినవే ఉన్నాయి. గవర్నమెంట్ స్కూళ్లలో పూర్తి స్థాయిలో టాయిలెట్ సౌకర్యం లేని రాష్ట్రాల్లో తెలంగాణ తర్వాత రాజస్థాన్(1,217), ఉత్తర ప్రదేశ్(1,137), జమ్మూకాశ్మీర్(1,067) ఉన్నాయి. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ మేరకు రాజ్యసభకు సమర్పించిన రిపోర్టులో ఈ వివరాలు వెల్లడించారు. 

రాష్ట్రంలో 7 శాతం స్కూళ్లలో నో టాయిలెట్స్ 

తెలంగాణలో 30,023 ప్రభుత్వ బడులు ఉండగా 27,899 స్కూళ్లలో టాయిలెట్స్ ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఇందులో బాయ్స్ కు 22,043 స్కూళ్లలో టాయిలెట్లు ఉండగా, 26,066 స్కూళ్లలో గర్ల్స్ కు టాయిలెట్ ఫెసిలిటీ ఉంది. అంటే బాయ్స్ కు 7,980 స్కూళ్లలో,  గర్ల్స్ కు 3,957 స్కూళ్లలో టాయిలెట్ ఫెసిలిటీ లేనట్లు రిపోర్టు వెల్లడించింది. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 258 స్కూళ్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 93, వరంగల్ జిల్లాలో 55 స్కూళ్లలో టాయిలెట్లు లేవని పేర్కొంది. 

11 వేల స్కూళ్లకు అందని భగీరథ నీళ్లు.. 

రాష్ట్రవ్యాప్తంగా100 శాతం ఆవాసాలకు మిషన్ భగీరథ నీటిని సప్లై చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో చాలా గ్రామాల్లో గవర్నమెంట్ స్కూళ్లు, విద్యాసంస్థలకు కూడా మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. అయినప్పటికీ ఇంకా 11,124 గవర్నమెంట్ స్కూళ్లకు(37 శాతం) ట్యాప్ కనెక్షన్ లేదని ధర్మేంద్ర ప్రధాన్ రిపోర్టులో తేలింది. అంటే రాష్ట్రంలో ప్రతి మూడింటిలో ఒక స్కూల్ కు ఇప్పటి వరకు నల్లా కనెక్షన్ లేదని తెలుస్తోంది.