పెద్దలు, మహిళలకే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ

పెద్దలు, మహిళలకే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ

హైదరాబాద్, వెలుగు: మన రాష్ట్రంలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో వృద్ధులు, మహిళలే ఎక్కువ మంది ఉన్నారని సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ లాసీ (లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా) రిపోర్టులో వెల్లడైంది. వృద్ధుల్లో 44.1%, మహిళల్లో 33.5%, మగవాళ్లలో 30.2% మంది కార్డియో వాస్క్యులర్ డిసీజ్ (సీవీడీ)తో బాధపడుతున్నట్లు తేలింది. 60 ఏండ్లకు పైబడిన వారిలో 44.1 శాతం మంది బాధితులు ఉంటే, 45–59 ఏండ్ల లోపు వాళ్లలో 22.6 శాతం మంది ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా 27.2 శాతం మంది సీవీడీతో బాధపడుతున్నారు. డ్రింకింగ్, స్మోకింగ్ ఒక్కటే హార్ట్ ప్రాబ్లమ్స్ కు కారణం కాదని హెల్త్ మినిస్ట్రీ రిపోర్టులో పేర్కొంది. శారీరక శ్రమ లేకపోవడం, తగినంత మోతాదులో పండ్లు, కూరగాయలు తినకపోవడంతోనూ గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని తెలిపింది.

అర్బన్ బాధితుల్లో మనమే సెకండ్..

పల్లెల్లో కంటే పట్టణాల్లోనే సీవీడీ బాధితులు ఎక్కువగా ఉన్నారని రిపోర్టులో వెల్లడైంది. సిటీల్లో ప్రాసెస్డ్ ఫుడ్ ను తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, పొల్యూషన్ ఎక్కువగా ఉండడం తదితర దీనికి కారణమని తేలింది. ఊర్లలో ఉండేటోళ్లు ప్రతిరోజు వ్యవసాయ పనులు చేస్తుండడంతో ఎక్సర్ సైజ్ అవుతోందని, దీంతో పల్లెల్లో తక్కువ మంది బాధితులు ఉన్నారని రిపోర్టు పేర్కొంది. అర్బన్​ఏరియాలోని సీవీడీ బాధితుల్లో దేశంలోనే మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. జమ్మూకాశ్మీర్ లో 51 శాతం మంది, తెలంగాణలో 46 శాతం మంది బాధితులు ఉన్నారు.

ఎన్నో కారణాలు…

పేదరికం, పోషకాహార లోపం కూడా సీవీడీకి కారణమని రిపోర్టులో తేలింది. సమయానికి తినకపోవడం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం, ఒబెసిటీ, స్మోకింగ్, డ్రింకింగ్, మానసిక ఒత్తిడి, బీపీ, డయాబెటిస్ కారణంగానూ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వెల్లడైంది. అపరిశుభ్రత, పట్టణాల్లో మురికివాడలు పెరిగిపోవడమూ గుండె జబ్బులు రావడానికి కారణమవుతున్నాయి. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, గుండె కొట్టుకోవడంలో సమస్యలు ఏర్పడటం, ఒత్తిడి, గుండె కండరం దళసరిగా ఉండటం తదితర కారణాలతో సడెన్ కార్డియాక్ అరెస్ట్ ఏర్పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతిరోజు ఎక్సర్ సైజ్ చేస్తే దీని బారినపడకుండా ఉండొచ్చంటున్నారు. అప్పుడప్పుడు ఈసీడీ, 2డీ ఎకో లాంటి టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

స్ట్రెస్ తోనే గుండె జబ్బులు 

గుండె జబ్బులు ఎక్కువగాస్ట్రెస్‌ వల్లనే వస్తున్నాయి. వంశపారంపర్యంగా కూడా సీవీడీ సమస్యలు వస్తాయి. సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో ఎక్కువ మంది బాధితులు ఉంటున్నారు. నిద్రలేమి, మంచి ఆహారం సమయానికి తీసుకోకపోవడం కూడా కారణాలే. పల్లెల్లో జనం ఫిజికల్​గా ఎక్కువగా పని చేస్తరు. సిటీల్లో పొల్యూషన్ కు తోడు శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. ఫ్యాట్​పెరగడంతోనూ గుండె జబ్బులు వస్తాయి. ఎక్సర్ సైజ్ చేయడంతో పాటు స్ట్రెస్ తగ్గించుకోవాలి.

– డాక్టర్​ శేషగిరిరావు, కార్డియాలజిస్ట్