కవర్ స్టోరీ : నేచర్​ టూర్ మన పక్కనే!

కవర్ స్టోరీ : నేచర్​ టూర్ మన పక్కనే!

బిజీబిజీ జీవితాల నుంచి బ్రేక్​ తీసుకునేందుకు ‘కాస్త టైం దొరికితే బాగుండు’ అనుకోని వాళ్లు ఉండరు ఈ రోజుల్లో. అందుకే చాలామంది వీకెండ్‌‌ కోసం ఎదురు చూస్తుంటారు. కానీ.. ఇదివరకటిలా ఇప్పటి జనరేషన్​ వీకెండ్స్​లో​ ఇంట్లోనే రెస్ట్ తీసుకుందాం  అనుకోవడం లేదు. ఆటవిడుపుకోసం అడ్వెంచర్స్‌‌ చేస్తున్నారు. అడవిలో హాయిగా గడపాలి అనుకుంటున్నారు. సరదాగా కాసేపు  సేద తీరేందుకు.. దగ్గర్లోని టూరిస్ట్‌‌ ప్లేస్‌‌లకి వెళ్తున్నారు. 

వాటిలో కూడా నేచర్‌‌తో కనెక్ట్​ అయిన‌‌ టూరిస్ట్‌‌ ప్లేస్‌‌లకే ఎక్కువమంది ఓటు వేస్తున్నారు. పెద్దవాళ్లే కాదు పిల్లలు కూడా వారమంతా భుజాన పుస్తకాల బరువు, బుర్రల్లో పాఠాల బరువు మోసి అలసిపోతున్నారు. అందుకే ఆదివారం రాగానే తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని ఇంటికి దూరంగా... నేచర్‌‌‌‌కి దగ్గరగా ఉండే టూరిస్ట్ ప్లేస్‌‌లకు ఛలో అంటున్నారు. మన రాష్ట్రంలో ఉన్న అలాంటి కొన్ని టూరిస్ట్‌‌ ప్లేస్‌‌లు ఇవి....

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లోని ఆహ్లాదకర వాతావరణం కోసం ఖండాలు దాటి అందమైన పక్షులెన్నో వస్తుంటాయి. వేల మైళ్ల దూరం నుంచి ప్రయాణించి వస్తున్న ఈ పక్షులను చూడటం పక్షి ప్రేమికులకు ఓ పండుగ. ఏడాది పొడవునా కాగజ్​నగర్ డివిజన్ ఫారెస్ట్‌‌లో వలస (మైగ్రేట్‌‌) పక్షుల కిలకిలలు కొత్త అందాన్ని తెచ్చి పెడుతున్నాయి. 

పొడుగు ముక్కు రాబందులు

కాగజ్​నగర్ అడవులు జీవ వైవిధ్యానికి నిలయం. అడవికి నలుదిక్కులా ఏడాది పొడవునా నదులు, వాగులు ప్రవహిస్తుంటాయి. పెంచికల్ పేట్ రేంజ్​లోని నందిగాం దగ్గర పాలరాపు గుట్ట ఉంది. ఇది  అంతరించి పోతున్న పొడుగు ముక్కు రాబందులకు నిలయంగా మారింది. వీటిని ఇక్కడ పదేళ్ల క్రితం గుర్తించారు. ఈ గుట్టకు ఆనుకొని పారుతున్న పెద్దవాగు, ప్రాణహితకు అవతలి వైపు మహారాష్ట్రలో కమలాపూర్​లో ఈ రాబందుల నివాస స్థలం ఉంది. ఇక్కడికి పర్యాటకులు రెగ్యులర్‌‌‌‌గా వస్తుంటారు. 

ఎటుచూసినా పక్షులే 

అడవిలో ఏ మూలన చూసినా పక్షులు, గద్దలు కనిపిస్తాయి. గతంలో రెండు సార్లు ‘బర్డ్ వాక్ ఫెస్టివల్’ జరిగింది. అప్పుడు రాష్ట్రంలోని వందకు పైగా టూరిస్ట్​లు, నేచర్, బర్డ్ లవర్స్ ఈ అడవిలో తిరిగారు. పక్షులను కెమెరాల్లో రికార్డ్ చేశారు. ఇప్పుడు మూడొందల వరకు పక్షి జాతులు ఉన్నాయి ఇక్కడ. హైదరాబాద్ నుంచి రైల్లో రావచ్చు ఇక్కడికి. హైదరాబాద్‌‌కు 330 నుంచి 380 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. ట్రైన్ రూట్‌‌ జర్నీ అయితే ఈజీగా కాగజ్‌‌నగర్​  చేరుకోవచ్చు. అడవిలో వన్య ప్రాణుల మానిటరింగ్ కోసం స్థానికంగా బేస్ క్యాంప్ ఒకటి కట్టారు. త్వరలో సఫారీ రైడ్ మొదలుపెట్టాలని ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ ప్లాన్​ చేస్తోంది. వర్షాకాలంలో సీజనల్ వాటర్ ఫాల్స్ కళ్లను కట్టిపడేస్తాయి. ప్రాణహిత, పెద్దవాగుల్లో పడవ ప్రయాణం చేయొచ్చు.

పోదాం.. పద.. జోడేఘాట్

ఒకప్పుడు ఇఅక్కడికి వెళ్లాలంటే నక్సల్స్​ ఉండేవాళ్లని అందరూ భయపడేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. చుట్టూ ఎత్తయిన కొండలు. పచ్చని  పొలాలు. ఎంతసేపు చూసిన చూడాలనిపించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న మ్యూజియం ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను ‘రా.. రమ్మని’ ఆహ్వానం పలుకుతాయి. ‘గిరిజన మ్యూజియం’తో జోడేఘాట్​కు కొత్త వెలుగు వచ్చింది. కుమ్రంభీం జిల్లాకే ఈ మ్యూజియం కొత్త శోభ తెచ్చిపెట్టింది.  

పోరుగడ్డలో...

నాగరికత సోకని అటవీ ప్రాంతం అది. గల గల జాలువారే సెలయేళ్లు.. వాటి మధ్యన పూరి గుడిసెలు. ఆ గుడిసెలను కలిపే ఒక కుగ్రామం. ఆ గ్రామం పేరే జోడేఘాట్. ఈ ఊరి పేరు వింటేనే గిరిజన గుండెల్లో ఆనందం పరవశించి పోతుంది. జల్ (నీరు), జంగల్(అడవి), జమీన్(భూమి) కావాలనే నినాదంతో నిజాం నవాబులతో వీరోచితంగా పోరాడి నవాబుల గుండెల్లో తూటాలైపేలిన అమరుడు, అడవి తల్లి ముద్దు బిడ్డ కుమ్రంభీం నేలకొరిగిన పోరుగడ్డ జోడేఘాట్. ఇక్కడ గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ మ్యూజియానికి అనేక ప్రత్యేకతలున్నాయి.

కుమ్రంభీం స్మారక చిహ్నం, జల్, జంగల్, జమీన్ ముఖద్వారం, యాంఫీథియేటర్, మల్టీమీడియా హాల్, అమరవీరులకు చిహ్నంగా నిలిచే నాలుగు గోత్రాల జెండాలు, కుమ్రంభీం సహచరుల ప్రతిమలు, గుస్సాడి నృత్యం చేస్తున్న ప్రతిమలు, ఆదివాసీల సంప్రదాయ వాయిద్యాలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఆదివాసీ తెగలైన గోండులు పూజించే పెర్స్ పెన్, కోళాం గిరిజనులు పూజించే పోతరాజు, పర్దాన్, తోటి, కోయలు పూజించే దేవతా మూర్తులు, ఆదివాసీలు వాడిన వస్తువులను ఈ మ్యూజియంలో చూడొచ్చు.

ఆహా... కాశ్మీరమా! 

ఇక్కడి వాతావరణం కాశ్మీర్​ను తలపించేలా ఉంటుంది. అందుకే మన రాష్ట్ర టూరిస్ట్​లే కాకుండా   మహారాష్ట్రకు చెందిన టూరిస్ట్​లు కూడా బాగానే వస్తుంటారు. ఎత్తయిన కొండలు, జాలు వారే సెలయేళ్లు, గుట్టలపై పోడు వ్యవసాయం చూస్తుంటే కళ్లతో పాటు మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. సెలవు రోజుల్లో స్టూడెంట్స్‌‌ జోడేఘాట్​కు ఎక్కువగా వస్తుంటారు. కావాలనుకుంటే ఇక్కడ బస కూడా చేయొచ్చు.

అబ్బురపరుస్తున్న శిలాజాలు

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌‌నగర్ అటవీ ప్రాంతంలోని పెంచికల్ పేట్ రేంజ్ కొండపల్లి అడవులు అరుదైన శిలాజాలకు నిలయం.  జిల్లాలోని మారుమూల ప్రాంతంలో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కర్ర శిలాజాలు(ఉడ్ ఫాజిల్స్) ఉన్నాయి. ఇవి అడవిలో 20 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని ఈ అరుదైన వృక్ష శిలాజాల సంపదను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు సంబంధిత అధికారులు.

వేల ఏళ్ల కిందటివి

ఈ వృక్ష శిలాజాలు గోదావరి, దాని ఉపనది ప్రాణహిత కారిడార్​లో కొన్ని వేల ఏండ్ల క్రితం వచ్చిన వాతావరణ మార్పుల ఏర్పడ్డాయని ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు. సుమారు20 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ శిలాజాలు నిక్షిప్తమై ఉన్నాయి. అతి ఉష్ణం కారణంగా భారీ వృక్షాలు నేలలో కూరుకుపోయి శిలాజాలుగా మారినట్లు అధికారులు చెప్తున్నారు. 

ఇలా గుర్తించారు

ఫారెస్ట్ అధికారులు 2015లో మొట్టమొదటగా వీటిని గుర్తించారు. అప్పటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈ ఫాజిల్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి, పురావస్తు శాఖకు నివేదిక ఇచ్చారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం, పురావస్తు శాఖ నుండి నిపుణుల బృందం స్థానిక అటవీ ప్రాంతానికి వచ్చి వృక్ష శిలాజాలను పరిశీలించారు. 

డెవలప్ చేయాలి

ఈ శిలాజాలు వర్షాకాలంలో వరదలకు కొట్టుకు పోతున్నాయి. వీటిని సంరక్షించేందుకు ప్రభుత్వం, అటవీ విభాగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దేశంలోని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్​లో ఇలాంటి ఉడ్ ఫాజిల్స్​తో చక్కని పార్కులు ఉన్నాయి. దానివల్ల ఆయా ప్రాంతాల్లో టూరిజం డెవలప్​ అవుతోంది. 

చూడగానే మనసుల్ని కట్టిపడేసే అందాలు.అందమైన పక్షుల కిలకిల రావాలు. ఔరా! అనిపించే ప్రాణహిత పరవళ్ళు. అడుగడుగునా ప్రకృతి రమణీయతను  చూసేందుకు వైల్డ్ లైఫ్ వాచర్స్,  వైల్డ్​లైఫ్ ఫొటోగ్రాఫర్లు, కాలేజీ స్టూడెంట్స్ ఆసిఫాబాద్​ అడవికి ‘క్యూ’ కడుతున్నారు. 

ఇలా వెళ్లాలి

ఆదిలాబాద్ వైపు నుంచి వచ్చేవాళ్లు ఉట్నూర్ ఎక్స్ రోడ్డు నుండి జైనూర్ కెరమెరి, హట్టి మీదుగా జోడేఘాట్​కు చేరుకోవచ్చు. 
కెరమెరి మండల కేంద్రం నుండి హట్టి మీదుగా21 కిలోమీటర్లు ఉంటుంది. 
ఆసిఫాబాద్  నుండి జోడేఘాట్ 51 కిలోమీటర్లు.

దూస మహేశ్, కాగజ్‌నగర్‌‌