హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణం.. ఇద్దరు కొడుకులను చంపి తల్లి ఆత్మహత్య

హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణం.. ఇద్దరు కొడుకులను చంపి తల్లి ఆత్మహత్య
  • పదమూడేండ్ల కింద ప్రేమ వివాహం
  • సంవత్సరం క్రితం మరో పెండ్లి చేసుకున్న భర్త
  • విడాకులు కావాలని కోరిన బాధితురాలు
  • పంచాయితీలో సర్ధి చెప్పిన పెద్దలు..
  • బాగా చూసుకుంటానని ఇటీవలే తీసుకెళ్లిన భర్త

కూకట్​పల్లి, వెలుగు: ప్రేమించి పెండ్లి చేసుకున్న భర్త రెండో వివాహం చేసుకోవడమే కాక రోజూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ ఓ భార్య తన ఇద్దరు కొడుకులను చంపి సూసైడ్​ చేసుకుంది. తనకు విడాకులు కావాలని కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో మొరపెట్టుకున్నా.. కాపురాన్ని నిలబెట్టుకోవాలని అందరూ సర్ది చెప్పారు. 

భర్త కూడా తన ఇంటికి వచ్చి ఇక నుంచి బాగా చూసుకుంటానని నమ్మబలకడంతో ఊరి నుంచి పిల్లలను తీసుకుని వచ్చి భర్తతో ఉంటోంది. వచ్చిన తెల్లారే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే, తల్లే పిల్లలను చంపి సూసైడ్​ చేసుకుని ఉంటుందని ప్రాథమిక దర్యాప్తు తర్వాత పోలీసులు తేల్చినా.. మృతురాలి భర్తే వారిని హత్య చేసి నాటకం ఆడుతున్నాడని బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. 

వరంగల్​ జిల్లా చెన్నారావుపేట మండలం, మాణిక్యం తండాకు చెందిన బోడ ప్రవీణ్(31), అదే మండలం పదహారుచింతల తండాకు చెందిన స్రవంతి(27)ని 13 ఏండ్ల క్రితం ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. ఇరు వైపుల పెద్దలు కూడా ఇందుకు అంగీకరించారు. తర్వాత భార్యాభర్తలు హైదరాబాద్​సిటీకి వచ్చి మూసాపేట పరిధి కైత్లాపూర్​సమీపంలోని రాఘవేంద్రసొసైటీ కాలనీలో ఉంటున్నారు. వీరికి కార్తీక్​(10), కౌశిక్​(8) ఇద్దరు కొడుకులున్నారు. 

ఏడాది కింద వివాహేతర సంబంధం 
సంవత్సరం క్రితం ప్రవీణ్​ తన భార్య స్రవంతికి సోదరి వరుసయ్యే సోనీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి స్రవంతి భర్తతో గొడవ పెట్టుకోవడంతో.. రోజూ తాగి వచ్చి భార్యను శారీరకంగా, మానసికంగా వేధించటం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన స్రవంతి ఏడాది కిందట తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి విషయం చెప్పింది. అయినా పరిస్థితి మారకపోవటంతో పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేసింది. విడాకులు ఇప్పించాలని తల్లిదండ్రులను కోరింది. 

అయితే, కుటుంబ సభ్యులు, ఊరి పెద్దలు జోక్యం చేసుకుని పంచాయితీ పెట్టి సర్దుకుపోవాలని చెప్పారు. పెద్దలు, తల్లిదండ్రుల సూచన మేరకు పలుమార్లు తన భర్త వద్దకు వచ్చిన స్రవంతికి అతని ప్రవర్తనలో మార్పు కనిపించలేదు. భర్త ధోరణి మార్చుకోకపోవటంతో 4 నెలల క్రితం పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో తన భర్త ఇటీవల సోనీని రెండో పెండ్లి చేసుకున్నాడనే విషయం స్రవంతికి తెలిసింది. ఈ విషయం కూడా కుటుంబ సభ్యులకు, ఊరి పెద్దల దృష్టికి తీసుకువెళ్లి విడాకులు ఇప్పించాలని కోరింది.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఊరికి వచ్చిన ప్రవీణ్.. సోనీతో సంబంధం లేదని, ఇక నుంచి భార్యను బాగా చూసుకుంటానని ఆమె కుటుంబ సభ్యులకు, ఊరి పెద్దలకు చెప్పాడు. దీంతో అందరూ కలిసి భర్తతో వెళ్లాలని స్రవంతికి సూచించారు. మనసు మార్చుకున్న స్రవంతి భర్తతో కలిసి సోమవారం సాయంత్రం కూకట్​పల్లిలోని ఇంటికి చేరుకుంది. అదే రోజు రాత్రి మరోసారి రెండో పెండ్లి విషయంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

మంగళవారం ఉదయం డ్యూటీకి వెళ్లిన ప్రవీణ్​ మధ్యాహ్నం లంచ్​కి ఇంటికి వచ్చాడు. ఇంటి లోపల గడియ వేసి ఉండటంతో స్థానికుల సహాయంతో తలుపు పగులగొట్టి చూస్తే భార్య, పిల్లలు ఉరి వేసుకుని కనిపించారని ప్రవీణ్​ పోలీసులకు తెలిపాడు. స్రవంతి మనో వేదనతో పిల్లలకు ఉరి వేసి చంపి తాను కూడా  సూసైడ్​ చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

భర్త పైనే ఆరోపణలు
స్రవంతి కుటుంబ సభ్యులు మాత్రం ప్రవీణే వా హత్య చేసి నాటకం ఆడుతున్నాడని ఆరోపిస్తున్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణాలకు అసలు కారణం ఏమిటనేది స్పష్టం అవుతుందని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని కూకట్​పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భర్త ఇంటికి నిప్పు
నర్సంపేట, వెలుగు:  స్రవంతి, ఆమె ఇద్దరు కుమారులు మృతిచెందడంతో.. వారి స్వగ్రామం మాణిక్యం తండాలో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహంతో ప్రవీణ్​ ఇంటికి నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. తండా వాసులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. బందోబస్తు ఏర్పాటు చేశారు.