
హైదరాబాద్: ఆ యువతి వయసు 18 సంవత్సరాలు. పెళ్లయి మూడు నెలలే అయింది. నట్టింట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్లోని మూసాపేట్లో జరిగింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మూసాపేట్ యాదవ్ బస్తీకి చెందిన సురవపు రమ్య (18) నట్టింట్లో విగత జీవిగా కనిపించింది. మూడు నెలల క్రితం ఈమెకు వివాహమైంది. భర్తతో కలిసి తల్లిదండ్రుల వద్దే నివాసం ఉంటోంది.
ఇంటి పనుల విషయంలో తల్లి మందలించడంతో రమ్య మనస్తాపానికి లోనైంది. సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఓ కష్టం.. ఓ నష్టం.. ఆవేదన, ఆవేశం.. ఆక్రోశం.. ఏదో ఒక కారణం..ఏదో ఒక ఆందోళన.. మనిషిని తన ప్రాణం తాను తీసుకునేలా చేస్తోంది. సమస్యలను ఎదుర్కోలేని మానసిక బలహీనతే ఆ పని చేయిస్తోంది. అలా అర్థంతరంగా తనువు చాలిద్దామనుకున్న వారిలో ఆలోచన రగిలేలా చేయాలంటోంది సమాజం.
ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్న వారిలో ఆలోచన రగిలిస్తే.. చైతన్యం తీసుకొస్తే గండం గడచిపోతుంది. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోలేక చిన్న చిన్న సమస్యలకే భయపడిపోయి ఆత్మహత్యలకు పాల్పడేవారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువవుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం, జీవితంలో పెరిగిపోతున్న యాంత్రికత, తీవ్రమైన మానసిక ఒత్తిడి ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్నాయనేది మానసిక విశ్లేషకుల అభిప్రాయం. జీవితంపై సానుకూల ధోరణిలో ఒక్క క్షణం ఆలోచించినా ఆత్మహత్య ఆలోచన రాదు.