న్యూఢిల్లీ: దేశానికి చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్లు వెంకటేశ్ గార్గ్, భాను రాణాను భారత సెక్యూరిటీ ఏజెన్సీలు విదేశాల్లో అరెస్టు చేశాయి. వెంకటేశ్ ను జార్జియాలో, భానును అమెరికాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ విదేశాల్లో ఉంటూ నేరాలకు పాల్పడుతున్నారు. త్వరలో ఆ ఇద్దరినీ స్వదేశానికి తీసుకురానున్నారు.
రాణాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయి. హర్యానాలోని కర్నాల్ కు చెందిన రాణా.. చాలాకాలంగా అమెరికాలో ఉంటున్నాడు. అక్కడి నుంచే నేరాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే అతనిపై వివిధ కేసులు నమోదై ఉన్నాయి. రాణా చిన్నచిన్న నేరాలతో మొదలుపెట్టి క్రమంగా గ్యాంగ్ స్టర్ గా మారాడు. హర్యానా, పంజాబ్,
ఢిల్లీకి తన క్రిమినల్ నెట్ వర్క్ ను విస్తరించాడు.
గార్గ్ పై 10 పైనే క్రిమినల్ కేసులు
హర్యానాకే చెందిన మరో గ్యాంగ్ స్టర్ వెంకటేశ్ గార్గ్ పై 10పైనే క్రిమినల్ కేసులు ఉన్నాయి. హర్యానా, రాజస్తాన్, ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని వివిధ రాష్ట్రాల నుంచి యువకులను అతను రిక్రూట్ చేసుకుని నేరాలు చేయించాడు. గురుగ్రాంలో బీఎస్పీ లీడర్ హత్యలో గార్గ్ హస్తం ఉంది. ఈ హత్యకు పాల్పడిన తర్వాత అతను జార్జియాకు పారిపోయాడు.
