పోలీసుల అదుపులో మావోయిస్టు బరిసే దేవా !

పోలీసుల అదుపులో మావోయిస్టు బరిసే దేవా !
  • 17 మంది గెరిల్లా ఆర్మీ సభ్యులతో కలిసి లొంగుబాటు
  • లైట్‌‌‌‌ మెషీన్‌‌‌‌ గన్‌‌‌‌ సహా 20కి పైగా ఆయుధాలు అప్పగింత
  • రేపు మీడియా ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు
  • 30 ఏండ్లు హిడ్మాతో కలిసి పలు ఆపరేషన్లలో పాల్గొన్న దేవా

హైదరాబాద్‌, వెలుగు: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్‌‌లో మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా ఎన్​కౌంటర్​ మరవకముందే.. ఆయన అనచరుడు, మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్, కమాండర్‌‌  బరిసే దేవా అలియాస్ చంద్రపాల్‌, సుక్కు పోలీసులకు లొంగిపోయాడు. 17 మంది గెరిల్లా లిబరేషన్ ఆర్మీ సభ్యులతో కలిసి -చత్తీస్‌గఢ్ సరిహద్దులో తెలంగాణ పోలీసులకు సరెండర్ అయ్యాడు. లైట్‌ మిషన్‌ గన్‌ సహా 20కి పైగా ఆయుధాలను అప్పగించినట్టు తెలిసింది.

వీరంతా ప్రస్తుతం తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ఆయుధాలతో సహా లొంగిపోయిన బరిసే దేవా టీమ్‌ను హైదరాబాద్‌ కు తరలిస్తున్నారు. డీపీజీ శివధర్‌‌ రెడ్డి సమక్షంలో ఆదివారం లేదా సోమవారం మీడియా ముందు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. కాగా, బరిసే దేవాపై రాష్ట్రంలో రూ.50 లక్షల రివార్డ్‌ ఉన్నట్టు తెలిసింది. దేవాతో పాటు లొంగిపోయిన వారికి కూడా తక్షణ సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.25 వేలు అందించనుంది.

హిడ్మా మృతి తర్వాత పీఎల్‌జీఏ మొదటి బెటాలియన్‌కు నేతృత్వం.. 
మావోయిస్టు పార్టీలో  మడావి హిడ్మా అత్యంత కీలక పాత్ర పోషించాడు. చత్తీస్ గఢ్ సుక్మా జిల్లా పువర్తికి చెందిన హిడ్మాకు అదే గ్రామానికి చెందిన చంద్రపాల్‌ అలియాస్‌ బరిసే దేవా ప్రధాన అనుచరుడు. 1996లో హిడ్మాతో పాటు చంద్రపాల్ సహా అదే గ్రామం నుంచి మరో 50 మంది వరకు మావోయిస్టు పార్టీలో చేరారు. 

నాటి నుంచి మడావి హిడ్మాతో కలిసి పనిచేశారు. సీపీఐ -మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత.. ఎనిమిది బెటాలియన్లతో కూడిన పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) ఏర్పడింది. ఇందులో మొదటి బెటాలియన్‌కు మడావి హిడ్మా నేతృత్వం వహించాడు.

హిడ్మా నేతృత్వంలోనే బరిసే దేవా భారీ ఆపరేషన్లు నిర్వహించాడు. రెండేండ్ల క్రితం బెటాలియన్ కమాండర్‌‌గా ఉన్న హిడ్మా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్‌జడ్‌సీ) కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బెటాలియన్‌కు దేవా నాయకత్వం వహించాడు. 

హిడ్మాతో కలిసి బస్తర్‌ లో‌ భారీ మావోయిస్ట్ కార్యకలాపాలు నిర్వహించాడు. గెరిల్లా లిబరేషన్‌ ఆర్మీని ముందుండి నడిపించాడు. మారేడుమిల్లి అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో హిడ్మా మృతితో తన గెరిల్లా ఆర్మీ సభ్యులతో కలిసి తెలంగాణ పోలీసులకు లొంగిపోయాడు.