మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రియాజ్ నైకూ హతం

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రియాజ్ నైకూ హతం
  • మూడు రోజుల క్రితం జవాన్ల హత్యకు ప్రతీకారం

శ్రీనగర్ : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, హిజ్బుల్ కమాండర్ రియాజ్ నైకూ ను సైనిక బలగాలు ఎన్ కౌంటర్ లో హతమార్చాయి. జమ్ము కశ్మీర్ లోని రియాజ్ నైకూ సొంతూరు బేగ్ పూర్ లోనే అతన్ని కాల్చి చంపాయి. జమ్ము కశ్మీర్ లో ట్రెరరిస్ట్ లకు పెద్దన్న గా ఉన్న రియాజ్ ను హతమార్చటం సైనిక బలగాలు సాధించిన కీలక విజయం. మూడు రోజుల క్రితమే హందార్వాలో ఐదుగురు జవాన్లను టెర్రరిస్టులు దొంగదెబ్బ తీసి చంపేశారు. చనిపోయిన వారిలో కల్నల్ స్థాయి అధికారి కూడా ఉన్నాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సైన్యం…ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ఆ దిశగా టెర్రరిస్టులను ఏరివేసేందుకు ఆపరేషన్ మొదలుపెట్టింది. జవాన్లు చనిపోయిన మూడు రోజుల్లోనే సైన్యం రివెంజ్ తీర్చుకుంది. హిజ్బుల్ టాప్ మోస్ట్ కమాండర్ రియాజ్ నైకూను హతమార్చి అమరులైన జవాన్లకు ఘన నివాళి అర్పించింది. మూడు రోజులుగా టెర్రరిస్టుల కోసం ఆపరేషన్ మొదలుపెట్టిన భద్రతా బలగాలకు రియాజ్ స్వస్థలం బేగ్ పూర్ కు వచ్చాడన్న సమాచారం అందింది. వెంటనే ఆ గ్రామాన్ని రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్‌పీఎఫ్‌, స్పెష‌న‌ల్ ఆప‌రేష‌న్స్ గ్రూప్ దళాలు చుట్టుముట్టాయి. రియాజ్ నైకూ పారిపోకుండా దిగ్భంధించాయి. అతను దాక్కున్న ఇంట్లోకి కాల్పులు జరిపాయి. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు జరిపిన తర్వాత రియాజ్ నైకూ చనిపోయినట్లు ధృవీకరించాయి. పుల్వామా జిల్లాలోని షార్షలీలో మరో ఇద్దరు టెర్రరిస్టులను సైనిక బలగాలు కాల్చి చంపాయి. కొంతకాలంగా జమ్ముకశ్మీర్ లో టెర్రరిస్టులకు రియాజ్ నుంచే అన్ని విధాలుగా సహాయం అందుతుందని భద్రత బలగాలు తెలిపాయి. అతని సమాచారం ఇచ్చిన వారికి 12 లక్షల రివార్డును గతంలోనే ప్రకటించాయి. రియాజ్ నైకూ ను చుట్టుముట్టినప్పటి ఎన్ కౌంటర్ లో కాల్చి చంపే వరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సీనియర్ అధికారులు సమీక్షించారు. జమ్ము కశ్మీర్ పోలీసులు ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ ఆపరేషన్ సమాచారాన్ని ట్వీట్ చేశారు.
ఎవరీ టెర్రరిస్ట్ రియాజ్
రియాజ్ నైకూ హిజ్ బుల్ లో కీలక స్థానంలో ఉన్నాడు. కశ్మీర్ లోయలో యువతను ట్రెరర్రిజం వైపు ఆకర్షించేందుకు వారిని రెచ్చగొడుతుండే వాడు. ట్రెరరిస్ట్ లకు గైడెన్స్ ఇస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నట్లు భద్రత బలగాలు గుర్తించాయి. టెర్రరిస్ట్ బుర్హాన్ వానీ ఎన్ కౌంటర్ లో చనిపోయిక హిజ్ బుల్ లో రియాజ్ చెప్పినట్లు నడుస్తోంది. ఎప్పటి నుంచో రియాజ్ ను పట్టుకోవటానికి సైనిక బలగాలు ప్రయత్నిస్తున్నాయి. అతన్ని పట్టించిన వారికి రూ. 12 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. రియాజ్ హతమవటంతో కశ్మీర్ లోయలో ట్రెరరిస్ట్ కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయని భద్రత బలగాలు అంచనా వేస్తున్నాయి.