పెరిగిన మదర్ డెయిరీ పాల ధరలు నేటి నుంచి అమల్లోకి...

పెరిగిన మదర్ డెయిరీ పాల ధరలు నేటి నుంచి అమల్లోకి...

రోజురోజుకూ అమాంతం పెరుగిపోతున్న ధరలతో ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, గ్యాస్ ధరలతో పాటు తాజాగా పాల ధరలూ పెరగడంతో సామాన్య జనానికి ఇక్కట్లు తప్పట్లేదు. లీటర్ ఫుల్ క్రీమ్ పాల ధర రూ.63 నుంచి రూ.64కు పెరిగింది. పెరిగిన ధరలు నవంబర్ 21నుంచి అమల్లోకి వస్తాయని మదర్ డెయిరీ ముందే ప్రకటించింది. దీంతో ఈ ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి. 

ప‌శుగ్రాసం, దాణా వంటి ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడంతో తప్పనిసరిగా ధరలు పెంచాల్సి వచ్చిందని మదర్‌ డెయిరీ ప్రతినిధులు తెలిపారు. ఈ సంవత్సరం మ‌ద‌ర్ డెయిరీ పాల ధ‌ర‌లు పెంచ‌డం ఇది నాలుగోసారి. మదర్‌ డెయిరీ ఢిల్లీ - ఎన్సీఆర్ ప‌రిధిలో ప్రతి రోజూ 30 ల‌క్షల లీట‌ర్లకు పైగా పాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తుంది. ఇలా పాల ధరలు పెరగడంతో సామాన్యుడికి టీ తాగడం భారంగా మారుతోంది. ఒకప్పుడు ఇరవై, ముప్పై రూపాయల్లోపు వచ్చే పాలు.. ఇప్పుడు రెట్టింపు ధరలయ్యాయి. కాగా, ఇప్పటికే విజయ, ఆమూల్, హెరిటేజ్ పాల ధరలను పెంచగా, ఇప్పుడు మదర్ డెయిరీ కూడా అదే బాటలో నడుస్తోంది.