
గాజా: రాకెట్ దాడిలో ఇళ్లు పూర్తిగా నేలమట్టమైనా.. శిథిలాలు మీదపడి మిగతా వాళ్లంతా చనిపోయినా.. ఓ ఐదు నెలల పసికందు మాత్రం ప్రాణాలతో బయటపడ్డడు. తన ప్రాణాలను అడ్డేసి తల్లి వాడిని కాపాడుకుంది. తల్లి ఒడిలో నుంచి బాబును రెస్క్యూ సిబ్బంది సేఫ్‌గా బయటకు తీశారు. ఈ ఘటనలో భార్య, నలుగురు పిల్లలు చనిపోగా.. ప్రాణాలతో బయటపడ్డ ఈ చిన్నారిని గుండెకు హత్తుకుని ‘ఈ ప్రపంచంలో నాకు నువ్వొక్కడివే మిగిలావురా’ అంటూ ఆ తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.
ఆ రాత్రి ఏంజరిగిందంటే..
గాజా సిటీకి చెందిన మహమ్మద్ అల్ హదీదికి భార్య, ఐదుగురు పిల్లలు. అందరికంటే చిన్నోడు ఒమర్ వయసు ఐదు నెలలు. ఉన్నంతలో సంతోషంగా బతుకుతున్న ఆ కుటుంబంలో మొన్నటి ఈద్ పండుగ విషాదం నింపింది. పండుగ కోసమని హదీది భార్య పిల్లలను తీసుకుని షాతి శరణార్థుల శిబిరంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. సాయంత్రందాకా సందడిగా గడిపింది. తర్వాత భర్తకు ఫోన్ చేసి రాత్రికి ఇక్కడే ఉంటామని చెప్పింది. అయితే, తెల్లవారుజామున ఇజ్రాయెల్ రాకెట్ దాడిలో వారున్న బిల్డింగ్ కూలిపోయింది. హదీది భార్యాబిడ్డలతో పాటు బంధువులు అందరూ చనిపోయారు. శిథిలాలు తొలగిస్తున్న సిబ్బందికి చిన్నపిల్లాడి ఏడుపు వినిపించడంతో జాగ్రత్తగా వెతికి.. తల్లి ఒడిలో ప్రాణాలతో ఉన్న ఒమర్‌ను బయటకు తీసుకొచ్చారు.
కాలుకు ఫ్రాక్చర్..
ఒమర్కుడికాలు మూడుచోట్ల విరిగిపోయింది. ముఖంపై దెబ్బలు తగిలాయి. కుడి కన్ను వాచిందని డాక్టర్లు చెప్పారు. అయితే, ఇలా జరుగుతుందనేమో ఒమర్ ఏనాడూ తల్లిపాలు తాగలేదని హదీది చెప్పారు. మిగతా పిల్లలు తల్లిపాలు తాగి పెరగగా.. ఒమర్ మాత్రం డబ్బా పాలు తాగుతున్నాడని అన్నారు.