బిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే తల్లి మృతి

బిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే తల్లి మృతి
  •     మెదక్  జిల్లా కేంద్రంలో ఘటన
  •     డాక్లర్ల నిర్లక్ష్యం వల్లే అని మెదక్- చేగుంట ప్రధాన రహదారిపై బంధువుల ధర్నా

మెదక్ టౌన్, వెలుగు :  మెదక్​ జిల్లా కేంద్రంలోని  మాతాశిశు సంరక్షణ కేంద్రంలో బిడ్డకు జన్మనిచ్చిన కాసేపటికే తల్లి కన్నుమూసింది. ప్రసవం తర్వాత  ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో మెదక్​ ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయింది. దీంతో మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. బాలింత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్  జిల్లా నార్సింగి మండల కేంద్రానికి చెందిన సుతారి రేణుక (29) కు పాపన్నపేట మండలం కొడపాకకు చెందిన నాగరాజుతో వివాహం జరిగింది. 

గర్భిణి అయిన రేణుకకు పురిటి నొప్పులు రావడంతో ఆమె తల్లిదండ్రులు  మెదక్​లోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి మంగళవారం సాయంత్రం తీసుకెళ్లారు. డాక్టర్లు నార్మల్  డెలివరీ చేయగా బాబుకు జన్మనిచ్చింది.  ప్రసవం తర్వాత రేణుకకు తీవ్ర రక్తస్రావం అవుతున్నదని, మెరుగైన వైద్యం కోసం వెంటనే సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. డాక్టర్ల సూచనల మేరకు గాంధీ ఆసుపత్రికి  తరలిస్తుండగా రేణుక (29) మార్గం మధ్యలో చనిపోయింది. మెదక్​ ఆసుపత్రిలో నార్మల్​ డెలివరీ అయిన తర్వాత రక్తస్రావం కావడంపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తూ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రేణుక మృతి చెందిందని మెదక్-–  చేగుంట రహదారిపై బైఠాయించారు. 

డాక్టర్ల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని మెదక్​ టౌన్​ ఎస్సై పోచయ్య తెలిపారు. ఈ విషయమై వివరణ కోరేందుకు ఆసుపత్రి డాక్టర్లను సంప్రదించగా స్పందించలేదు.