కరోనా భయం.. కన్నబిడ్డను కారు డిక్కీలో వేసిన తల్లి

కరోనా భయం.. కన్నబిడ్డను కారు డిక్కీలో వేసిన తల్లి

కరోనా వైరస్ మానవ సంబంధాలను మరింత దిగజార్చింది. వైరస్ సోకితే.. అయినవారు సైతం చెంతకు చేరని పరిస్థితిని తీసుకొచ్చింది. మహమ్మారి కారణంగా మానవ సంబంధాలన్నీ మంట గలుస్తున్నాయి. కన్నతల్లిదండ్రుల్ని కూడా కొందరు పట్టించుకోలేదు. కరోనా వచ్చిందని ..కన్నవారిని, కడుపున పుట్టిన వారిని సైతం ఆస్పత్రుల్లో వదిలేసిన దారుణ  పరిస్థితుల్ని మనం చూశాం. తాజాగా కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా సోకిన కన్న కొడకుని ఓ తల్లి కారు డిక్కీలో పడేసి కుక్కింది. అతడ్ని బయటకు తీయాలని అధికారులు చెప్పినా కూడా ఆమె పట్టించుకోలేదు. దీంతో ఆ మహిళపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ లో జరిగింది. 

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో నివసిస్తున్న సారా బీమ్ అనే మహిళ.. జనవరి 3న.. కరోనా సోకిన తన కుమారుడిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లింది. కారు డిక్కీలో ఉన్న తన 13 ఏళ్ల కుమారుడికి కరోనా పరీక్ష చేయాలంటూ అక్కడి వైద్యసిబ్బందిని పిలిచింది. అయితే వైద్య సిబ్బంది కుమారుడ్ని కారులో నుంచి బయటకు దించాలని తల్లిని కోరారు. దీంతో ఆమె  వైరస్ సోకిన తన కుమారుడిని పట్టుకునేందుకు సారా బీమ్ నిరాకరించింది. “టెస్ట్ చేస్తే చేయండి.. లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపోతా” అంటూ వైద్యసిబ్బందితో కొంతసేపు వాదించింది. చివరకు వారు ససేమిరా అనడంతో తన కుమారుడితో సహా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే బాలుడు కారు డిక్కిలోనే ఉండడంతో అతన్ని రక్షించేందుకు వైద్యసిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సారా కారు నెంబర్ ఆధారంగా ఆమె అడ్రెస్స్ ను కనుగొన్న పోలీసులు..చైల్డ్ ప్రొటెక్షన్ చట్టాల ప్రకారం సారా బీమ్ ను అరెస్ట్ చేశారు.