కొడుకు కోసం తల్లి సాహసం.. స్కూటీపై 1400 కిలోమీటర్ల జర్నీ

కొడుకు కోసం తల్లి సాహసం.. స్కూటీపై 1400 కిలోమీటర్ల జర్నీ

హైదరాబాద్: కొడుకును ఇంటికి తీసుకువచ్చేందుకు ఓ మహిళ సాహసమే చేశారు. లాక్ డౌన్ తో ఏపీలోని నెల్లూరులో చిక్కుకుపోయిన తన చిన్న కొడుకును ఇంటికి తీసుకొచ్చేందుకు స్కూటీపై మూడ్రోజుల్లో1400 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. నిజామాబాద్ బోధన్ కు చెందిన రజియా బేగం(48).. ప్రభుత్వ స్కూల్​లో హెడ్మాస్టర్. 15 ఏండ్ల కిందట భర్తను కోల్పోయారు. తన ఇద్దరు కుమారులు హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. చిన్న కొడుకు నిజాముద్దీన్ తన ఫ్రెండ్ తో కలిసి మార్చి 12న నెల్లూరులోని రహమతాబాద్ వెళ్లి అక్కడే ఉన్నాడు. ఇంతలో కరోనా వైరస్ ఎఫెక్టు, లాక్​డౌన్ తో ట్రాన్స్ పోర్ట్ అంతా రద్దయింది. అతను ఇంటికి తిరిగి రాలేకపోయాడు. కొడుకును ఎలాగయినా ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్న రజియా.. నెల్లూరు వెళ్లొచ్చేందుకు లోకల్ పోలీసుల పర్మిషన్ తీసుకున్నారు. అయితే తన పెద్ద కొడుకుని పంపిస్తే జాయ్ రైడ్ కోసం వచ్చాడని అనుమానించి అరెస్టు చేస్తారన్న భయంతో తానే స్వయంగా స్కూటీపై వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఏప్రిల్ 6న బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం కల్లా నెల్లూరు చేరుకుని, కొడుకును తీసుకుని సొంతూరుకి బయల్దేరారు. బుధవారం సాయంత్రం బోధన్ చేరుకున్నారు.

కొడుకును చూడకుండా ఉండలేకపోయా

కొడుకును చూడాలన్న తపనే తనను అంతదూరం వెళ్లేలా చేసిందని రజియా మీడియాతో చెప్పారు. కుమారుడ్ని ఇంటికి క్షేమంగా తీసుకురావాలనుకున్నానని, రోడ్లన్నీ ఖాళీగా ఉండటంతో రాత్రి సమయాల్లో కాస్త భయం అనిపించిందన్నారు. చాలా చోట్ల పోలీసులు ఆపారని, తన పరిస్థితిని వివరించడంతో సపోర్ట్ చేశారని వారికి థ్యాంక్స్ చెప్పారు.