
మెట్ పల్లి, వెలుగు : పదకొండేళ్ల కింద చనిపోయిందనుకున్న తల్లి తమిళనాడులో బతికే ఉందని తెలిసి ఆమె కుటుంబసభ్యులు సంతోషంతో తబ్బిబ్బయ్యారు. తమిళనాడు వెళ్లి సొంతూరికి తీసుకొచ్చారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామానికి చెందిన రెంజర్ల లక్ష్మి (48), నర్సయ్యలకు ముగ్గురు కూతుళ్లు. పెద్డ బిడ్డ పెళ్లి చేసిన తర్వాత నర్సయ్య గల్ఫ్‌కు వెళ్లాడు. ఆయన వెళ్లిన కొన్ని నెలలకు లక్ష్మి అనారోగ్యానికి గురై.. మానసిక స్థితి సరిగాలేక ఇల్లు విడిచిపోయింది. ఆమె కోసం కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. రెండేళ్ల తర్వాత కొనాపూర్ దగ్గర కుళ్లిపోయిన స్థితిలో మహిళ డెడ్ బాడీ దొరికింది. అది లక్ష్మి డెడ్‌బాడీగా భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా చేశారు. లక్ష్మి తిరుగుతూ తిరుగుతూ తమిళనాడులోని పేరంబలూరుకు చేరుకుంది. అక్కడ ఒక స్వచ్ఛంద సంస్థ ఆమెను చేరదీసి ట్రీట్మెంట్ ఇప్పించింది. ఇటీవల కోలుకున్న లక్ష్మి తన కుటుంబసభ్యుల వివరాలు చెప్పింది. దాంతో అక్కడి పోలీసుల ద్వారా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన తన కుటుంబసభ్యులను గుర్తు పట్టింది. వారు లక్ష్మిని ఇంటికి తీసుకొచ్చారు.