తల్లులు లాక్టోజెనిక్ ఫుడ్​ బాగా తినాలి

తల్లులు లాక్టోజెనిక్ ఫుడ్​ బాగా తినాలి

పసిపిల్లలకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు తాగించడం చాలా ముఖ్యం అంటారు డాక్టర్లు. తల్లిపాలతో వాళ్లకు పోషకాలు అందడంతో పాటు ఇమ్యూనిటీ కూడా వస్తుంది. అయితే కొందరు తల్లుల్లో పాలు సరిపోను ఉండవు. అలాంటివాళ్లు  చనుబాలు ఎక్కువ రావడానికి లాక్టోజెనిక్ ఫుడ్​ బాగా తినాలి అంటోంది చీఫ్​ డైటీషియన్ షాలిని అరవింద్​. 

లాక్టోజెనిక్ ఫుడ్ అంటే... పాల ఉత్పత్తిని పెంచే ఫుడ్​ అని అర్థం. మెంతులు, బార్లీ, ముదురు ఆకుపచ్చ రంగు ఆకుకూరలు, బీట్​రూట్, క్యారెట్​,  పచ్చి బొప్పాయి, అల్లం వెల్లుల్లి, నువ్వులు వంటివి లాక్టోజెనిక్ ఫుడ్ కిందకే వస్తాయి. అందుకని పాలిచ్చే తల్లుల భోజనంలో ఇవి తప్పనిసరిగా ఉండాలి. ప్రొటీన్స్​, ఫ్యాట్స్​తో పాటు అన్నిరకాల విటమిన్లు ఉన్న ఫుడ్ తినాలి.  ఎ, బి1, బి2, బి3, బి12 విటమిన్లు, ఫోలిక్​ యాసిడ్​, క్యాల్షియం, ఐరన్​ వంటివి ప్రొలాక్టిన్​ అనే హార్మోన్​ ఉత్పత్తిని పెంచుతాయి. ఈ హార్మోన్​ లెవల్స్​ పెరిగితే పాలు ఎక్కువ వస్తాయి. ఇవేకాకుండా...ఓట్స్, బ్రౌన్ రైస్​, బటానీలు, జీడిపప్పు, వాల్​నట్స్​, అవిసె గింజలు తిన్నా కూడా పాలు సరిపోను వస్తాయి. 

తల్లులు బలమైన తిండి తినడంతో పాటు ఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలి. అందుకోసం డీహైడ్రేట్ కాకుండా నీళ్లు బాగా తాగాలి. అజీర్తి, కడుపుఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఫైబర్​ ఎక్కువ ఉండే పండ్లు, కూరగాయలు తినాలి.