తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలంలోని మోత్కుపల్లి గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో గుడ్ గవర్నెన్స్ విభాగంలో దేశవ్యాప్తంగా మూడో స్థానాన్ని దక్కించుకుంది. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రుల చేతుల మీదుగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారితో కలిసి మోత్కుపల్లి గ్రామ సర్పంచ్ అమృతమ్మ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచినందుకు గుర్తింపుగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామానికి రూ.50 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది.
విమెన్ ఫ్రెండ్లీ కేటగిరీలో ‘ఫసల్‌వాది’
సంగారెడ్డి: విమెన్ ఫ్రెండ్లీ థీమ్ కేటగిరీలో సంగారెడ్డి మండలం ఫసల్‌వాది జీపీ జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. గ్రామపంచాయతీలో మహిళా సాధికారత, మహిళలకు అనుకూలమైన సేవలు, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రతిభ కనబరిచినందున కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును అందజేసింది. ఢిల్లీలో కలెక్టర్ ప్రతీక్ జైన్, సర్పంచ్ హరిప్రసాద్, కార్యదర్శి గోవింద్ శెట్టి అవార్డును అందుకున్నారు.
