మ్యూజిక్ థెరపీతో పేషెంట్‌లో చలనం

మ్యూజిక్ థెరపీతో పేషెంట్‌లో చలనం
  •     లివర్​ డ్యామేజీతో కదల్లేని స్థితిలో హాస్పిటల్‌లో చేరిన రోగి
  •     సినిమా పాటలకు నర్సులు చేసిన డ్యాన్సులతో పేషెంట్‌లో కదలికలు
  •     కరీంనగర్‌‌లోని హాస్పిటల్‌లో మ్యూజిక్‌ ట్రీట్‌మెంట్‌

కరీంనగర్ టౌన్, వెలుగు: కాళ్లు, చేతుల్లో చలనం లేని ఓ పేషెంట్‌కు డ్యాన్స్‌, మ్యూజిక్‌ థెరపీ ద్వారా కదలికలు తెచ్చారు కరీంనగర్‌‌లోని హాస్పిటల్‌ సిబ్బంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గొల్లపల్లికి చెందిన శ్రీనివాస్‌ లివర్‌‌ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో బ్రెయిన్‌కు ఆక్సిజన్‌ అందక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పలు ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కరీంనగర్‌‌లోని మీనాక్షి హాస్పిటల్‌కు తరలించి గత 15 రోజులుగా ఫిజియోథెరపీ అందిస్తున్నారు. ఈ క్రమంలో పేషెంట్‌ ఆరోగ్యం కొంత మెరుగుపడినా పూర్తిగా కోలుకోలేదు. దీంతో గత కొన్ని రోజులుగా ఫిజియోథెరపీతో పాటు డ్యాన్స్‌, మ్యూజిక్‌ థెరపీ ప్రారంభించారు. సినిమా పాటలు పెట్టి హాస్పిటల్‌లోని నర్సులు పేషెంట్‌ ముందు డ్యాన్స్‌ చేయడం మొదలు పెట్టారు. రోజూ ఒకటి రెండు సార్లు ఇలాగే పాటలు పెట్టి మ్యూజిక్‌కు అనుగుణంగా నర్సులు డ్యాన్స్‌ చేస్తుండేవారు. దీంతో పేషెంట్‌ కళ్లు తెరవడంతో పాటు రెండు కాళ్లు, ఒక చేతిలో కదలికలు వచ్చాయి. మరికొన్ని రోజులు ఇలాగే చేస్తే రెండో చేతిలో కూడా కదలికలు వస్తాయని, పేషెంట్‌ పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని హాస్పిటల్‌ ఎండీ డాక్టర్‌‌ రవికుమార్‌‌ తెలిపారు. పేషెంట్‌లో కదలికలు రావడంతో అతన్ని ఐసీయూ నుంచి జనరల్‌ వార్డుకు తరలించామని వెల్లడించారు.