కేసీఆర్​, కేటీఆర్​ దగాకోరులు..కాళేశ్వరం నీళ్లు ఎటు పోతున్నయ్​?

కేసీఆర్​, కేటీఆర్​ దగాకోరులు..కాళేశ్వరం నీళ్లు ఎటు పోతున్నయ్​?
  • ఆరుతడి పంటలే ఎందుకు వేయిస్తున్నరు?
  • రైతులకు నష్టం చేస్తున్నరని, పంటలను కొంటలేరని మండిపాటు

హైదరాబాద్, వెలుగుతండ్రీకొడుకులు కేసీఆర్​, కేటీఆర్​ దళారుల కంటే మించి దళారులు, దగాకోరులు అయిపోయారని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ మండిపడ్డారు. వలస పాలనలో పండించిన పంటలు కూడా ఇప్పుడు రాష్ట్రంలో పండించే పరిస్థితి లేకుండా చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మస్తు నీళ్లు ఉన్నాయంటున్న కేసీఆర్​.. మరి రైతులను ఆరుతడి పంటలే ఎందుకు పండించాలంటున్నారో చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు.  కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర ఇస్తుంటే.. దానికి రాష్ట్ర వాటా ఇవ్వలేని పరిస్థితిలో కేసీఆర్​ ఉన్నారని, అందుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని  ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని రూ. 3 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి, దివాలా పరిస్థితికి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ఎంపీ అర్వింద్​ శనివారం ఓ వీడియో విడుదల చేశారు. అందులో రాష్ట్రంలోని రైతుల పరిస్థితిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘‘వరి, పసుపు, మక్కలు వేసుకోవద్దు అని కేసీఆర్ దొర చెప్పిండు. సోయా వేసుకొమ్మన్నడు. ప్రభుత్వం ఇచ్చిన సోయా విత్తనాలు మొలకెత్తట్లే. మొలకెత్తితే దిగుబడి రాట్లే.. దిగుబడి వస్తే కేసీఆరే ధర రానియ్యడు. కేంద్రం ఎంఎస్ పీలో మక్కకు రూ. 1,850 , సోయాకు రూ. 3,850 ఇస్తున్నది. కానీ, కేసీఆరేమో ప్రొక్యూర్ మెంట్ చేస్తలేడు. కొనుగోలు కేంద్రాలు పెడుతలేడు. దీంతో రాష్ట్ర రైతులు రూ. 1000కి మక్క, రూ.3 వేలకు సోయా అమ్మకుంటున్నరు. ఇట్ల రాష్ట్ర రైతులు రూ. 800 నుంచి రూ.1,000 నష్టపోతున్నరు” అని అర్వింద్​ అన్నారు. ‘‘నువ్వు మాత్రం ఫాంహౌస్ లో  క్యాప్సికం, అల్లం , అస్పారాకోస్ లు అవకాడోలు, ఫైన్ డైనింగ్ , ఫైవ్ స్టార్ పంటలు పండించుకుంటూ అమ్ముకుంటున్నవ్​. ఎకరానికి కోట్లు సంపాదిస్తున్నట్లు చూపిస్తున్నవ్​. మరి మా రైతుల పరిస్థితి ఏంది? నువ్వు వేయమన్న సోయాను రైతులు వేసిన్రు. వాటిని నువ్వు కొనకపోతివి. సోయా రైతులు ఎటుపోవాలి? మక్క రైతులు ఏడికిపోవాలి?” అని కేసీఆర్​ను ఆయన నిలదీశారు.

రాష్ట్రం ఏ రకంగా ముందుకు పోతున్నది?

ఏ రకంగా రాష్ట్రం ముందుకుపోతన్నదో కేసీఆర్​ చెప్పాలని అర్వింద్​ డిమాండ్​ చేశారు. ‘‘విద్యనా.. ఒక్క యూనివర్సిటీకి వీసీ లేడు. వైద్యమా.. కరోనాలో అథోగతిపాలైంది. వ్యవసాయమా.. సూస్తనే ఉన్నం. పరిశ్రమలా.. ఏ ఒక్కటీ రాలె. ఉపాధా.. ఏ ఒక్క ఇంట్ల కూడా ఉద్యోగం ఇయ్యకపోతివి. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు, నీ కొడుకు దళారుల కంటే మించి దళారులు అయిపోయిండ్రు. దగాకోరులు  అయిపోయిండ్రు’’ అని కేసీఆర్​పై ఆయన ఫైర్​ అయ్యారు.  ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆనాడు దాశరథి అన్నరు. కేసీఆరేమో..  నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అంటున్నడు. కాళేశ్వరంతో మస్తు నీళ్లు ఉన్నయంటున్నడు. లక్షల కోట్ల అప్పు తెచ్చి కాళేశ్వరం కడుతున్నడు. రైతులను మాత్రం ఆరుతడి పంటలు వేసుకొమ్మంటున్నడు. వరి, మక్క, పసుపు వేసుకోవద్దంటున్నడు. ఇట్లయితే.. లక్షన్నర కోట్లతో కట్టిన కాళేశ్వరం నీళ్లు ఎటు పోయినయ్​?’’ అని నిలదీశారు. ప్రభుత్వం పైసలన్నీ కాళేశ్వరానికి ఖర్చు పెట్టి, బడ్జెట్ లేక కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేదని అర్వింద్ అన్నారు.