కేంద్ర సాయాన్ని కాళేశ్వరంలో ముంచకండి

కేంద్ర సాయాన్ని కాళేశ్వరంలో ముంచకండి

తప్పును నిలదీస్తానన్న భయంతోనే తనను అడ్డుకున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావే..కొందరు టిఆర్ఎస్ కార్యకర్తలతో తనపై దాడి చేయించిండని ఆరోపించారు. ఎర్దండి గ్రామంలో గోదావరినది వల్ల ముంపునకు గురైన వారిని పరామర్శించేందుకు వెళ్తుండగా.. టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొని కార్లు ధ్వంసం చేయడంపై ఆయన స్పందించారు. ప్రజాసమస్యలు తెలుసుకోనివ్వకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డం పడుతున్నారని మండిపడ్డారు.  465 మంది గోదావరి ముంపు బాధితులకు ప్రభుత్వం గతంలో పట్టాలిచ్చింది. అయితే లబ్దిదారులకు కేటాయించిన భూములను స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ బంధువులకు ఇప్పించుకున్నారని అర్వింద్ ఆరోపించారు. ఈ విషయంపై నిలదీస్తానన్న భయంతోనే దాడికి ఉసిగొల్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

భారీ వరద వల్ల వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని..నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని అర్వింద్ డిమాండ్ చేశారు.  కలెక్టర్లు వరద నష్టంపై అంచనాలు సరిగ్గా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఎంపీ అర్వింద్ అన్నారు. కేంద్రం నుంచి ఏం సాయం కావాలన్నా అందించే బాధ్యత తమదని చెప్పారు. కేంద్రం అందించే సాయాన్ని కాళేశ్వరంలో ముంచవద్దని అర్వింద్ చురకలంటించారు. ఎప్పుడేం జరగుతుందో తెలియక ప్రజలు భయపడుతున్నారని.. సీఎం కేసీఆర్ కు తన కుటుంబ ఆస్తులపై తప్ప దేనిపై చిత్తం లేదని విమర్శించారు. 

నాసిరకం నిర్మాణాల వల్లే చెక్ డ్యామ్లు కొట్టుకుపోయాయి

నాసిరకం నిర్మాణాల వల్లే చెక్ డ్యామ్లు కొట్టుకుపోయాయని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. వేల్పూర్ మండలం పచ్చల నడకుడ శివారులో వరదతో కొట్టుకుపోయిన చెక్ డ్యామ్లు, పంట పొలాలను ఆయన పరిశీలించారు. అనంతంర కమ్మర్పల్లి లో  పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులను పరామర్శించారు. వరదల వల్ల ఓ వ్యక్తి హోటల్ కూలిపోగా..అర్వింద్ అతడికి ఆర్థికసాయం అందజేశారు. కాగా పంట నష్టం అంచనా వేసి..నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని అర్వింద్ డిమాండ్ చేశారు. ఫసల్ భీమా అమలు చేయకపోవడం వల్ల తెలంగాణ రైతులు నష్టపోతున్నారన్న ఆయన..వరద నష్టంపై ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం నుంచి నిధుల వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. 

అర్వింద్ కారును ధ్వంసం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు

జగిత్యాల జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ను స్థానికులు అడ్డుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో TRS కార్యకర్తలు MP కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.